నమస్తే తెలంగాణ నెట్వర్క్: పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో తాజా మాజీ సర్పంచులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలకు దిగారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జీ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించి నిరసనలు వ్యక్తం చేశారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం జేఏసీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొంత నగదు వెచ్చించి గ్రామాల అభివృద్ధికి కృషిచేసిన మాజీ సర్పంచులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని యాదయ్యగౌడ్, జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే బిల్లులిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఏడాది దాటినా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి బిల్లులు చెల్లించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, నాయకులు కేశబోయిన మల్లయ్య, గణేశ్, నవీన్‌కుమార్, పల్లె వెంకటేశం, ప్రణీత్ చంద్, బాషబోయిన ఉప్పలయ్య, రమేశ్, పూర్ణచందర్‌గౌడ్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.