ఆసిఫాబాద్ టౌన్, మే 13 : యాప్ల పేరిట ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని సర్పంచుల సంఘం ఆసిఫాబాద్ జిల్లా గౌరవాధ్యక్షుడు జాబరి రవీందర్ హెచ్చరించారు. విద్యా వారోత్సవాలు, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది.
సమావేశం నుంచి బయటకు వచ్చిన సర్పంచులు, వార్డు సభ్యులు కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు, గుండీ సర్పంచ్ జాబరి రవీందర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, సేవ చేయనీయకుండా అనవసర యాప్ల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కేవలం కార్యాలయంలో కూర్చుని సమాచారం చేరవేసే క్లరులుగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవలు అందించడానికి అవసరమైన ఆర్థిక, పరిపాలనా పరమైన స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు.
నిధులు మంజూరు చేయకుండా షరతుల పేరిట అభివృద్ధిని కుంటుపరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాప్ల వినియోగం వల్ల పని భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచుల హకులను గౌరవించాలని, తక్షణమే నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఉద్యమం ఉధృతం చేస్తామని, అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.