హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు విసృ్తత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు నగరాల్లోని శ్రీచైతన్య శాఖల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేసి పన్ను ఎగవేతకు పాల్పడినట్టు శ్రీచైతన్య విద్యా సంస్థలపై అభియోగాలు ఉన్నాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీచైతన్య ప్రధాన కార్యాలయంలో కార్పొరేట్ వ్యవహారాలు, విద్యార్థులకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. ఇకడ దాదాపు 20 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసేందుకు ప్ర త్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను, పన్ను ఎగవేతకు మరో సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్టు ఈ సోదాల్లో గుర్తించారు. ఒక్క హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలోనే ఐటీ అధికారులు దాదాపు రూ.5 కోట్ల నగదును గుర్తించినట్టు తెలిసింది.