హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలోని టాప్-3 బులియన్ మర్చెంట్లలో ఒకటిగా పేరుగాంచిన ‘క్యాప్స్ గోల్డ్’ సంస్థ యజమానులతోపాటు వారి బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, మహంకాళి స్ట్రీట్‌లో సోదాలు చేపట్టి పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకోవడంతోపాటు సికింద్రాబాద్‌లోని ‘క్యాప్స్ గోల్డ్’ కార్యాలయాన్ని సీజ్ చేసినట్టు సమాచారం.
హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, నిర్మల్‌లోని రాజుపేట, మెట్పల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయి. ఈ ఏడాదిలో ఆ కంపెనీ రూ.20 వేల కోట్లకుపైగా విలువైన వ్యాపార లావాదేవీలు నిర్వహించినప్పటికీ ఆదాయ పన్ను రిటర్నుల్లో లెక్క చూపలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘క్యాప్స్ గోల్డ్’ యజమానులు చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.