ఉప్పునుంతల/కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 4 : ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుప్తా వెంకటేశ్వర్లు (35)కు భార్య దీపిక, కూతుళ్లు మోక్షిత(8), వర్షిణి(6), కుమారుడు శివధర్మ (4) ఉన్నారు. ఆగస్టు 30న భార్యతో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొని వెంకటేశ్వర్లు బైక్‌పై వెళ్లిపోయాడు.
బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో విగతజీవిగా కనిపించాడు. పురుగులమందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. అతడి వెంట వచ్చిన ముగ్గురు పిల్లలు ఎక్కడికి వెళ్లారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఉప్పునుంతల మండలం సూర్యతండా, అయ్యవారిపల్లి, రాయిచెడ్లో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఎస్సై విజయభాస్కర్, వెంకట్‌రెడ్డి గాలింపుచర్యలు చేపట్టారు.
సూర్యతండా సమీపంలోని శ్మశానవాటిక పక్కన ఉన్న గుట్టపై ముళ్లపొదల్లో కాలిపోయిన రెండు శవాలను కనుగొన్నారు. ఇవి వర్షిణి, శివధర్మ మృతదేహాలుగా గుర్తించారు. పెద్ద కూతురు మోక్షితను కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు గుర్తించారు. కాగా వీరిని వెంకటేశ్వర్లు ఆయా చోట్ల పెట్రోల్‌పోసి కాల్చిచంపిన అనంతరం తానూ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావించారు.