సూర్యాపేట : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రైతు భరోసా యాత్ర కాదని..ఇది ముమ్మాటికి రైతు భక్షణ యాత్ర అని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతుల మనుగడకే తీరని నష్టం కలిగించే విధానాలను అనుసరిస్తున్న బీజేపీ పార్టీ రైతులకు ఏ విధంగా భరోసా కల్పిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండించిన వరి పంట కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఉంటే ఏ ముఖం పెట్టుకుని ఐకెపి కేంద్రాలను సందర్శిస్తారని విమర్శించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఐకేపీ కేంద్రాల్లో పెడుతున్న ఆంక్షలను వెంటనే ఎత్తి వేయాలని అన్నారు.
ధాన్యం కుప్పల మీద రైతుల గుండెలు ఆగి పోతుంటే బండి సంజయ్ కి సోయి లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.