హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేనెలలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 8వ తేదీ తరువాత కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశమున్నదని మద్యం వ్యాపారవర్గాలు చెప్తున్నారు. ఇటీవల ‘సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కంపెనీ తెలంగాణలో అడుగుపెట్టగా.. అదేబాటలో మరికొన్ని కంపెనీలు రాష్ర్టానికి క్యూ కట్టనున్నట్టు తెలిసింది. రెండు నెలలుగా రాష్ట్రంలో కొన్ని నిర్ణీత బ్రాండ్లకు సంబంధించిన బీర్లు, ఇతర మద్యం రకాలు దొరకడంలేదు. మద్యం ప్రియులు కోరుకొనే ప్రముఖ బ్రాండ్లకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇండెంట్‌ను పెట్టలేకపోతున్నది.
ఉదాహరణకు 15 కార్టన్లను సప్లయ్ చేయాల్సిన చోట.. రేషన్ పద్ధతి విధించి 3 నుంచి 5 కార్టన్ల వరకే మద్యం షాపులకు అందిస్తున్నారు. తయారీ కంపెనీల వద్ద కావాల్సినంత స్టాక్ ఉన్నప్పటికీ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఇండెంట్ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మద్యం అమ్మకందారులు ఆరోపిస్తున్నారు. డిమాండ్ బ్రాండ్ల వినియోగాన్ని ఓ క్రమపద్ధతిలో తగ్గించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. పాత బ్రాండ్లకు పాతరేస్తారేమోనని చర్చ జరుగుతున్నది. కొత్త మద్యాన్ని అలవాటు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఎంతమేరకు అవి ప్రజల్లోకి వెళ్తాయనే సందేహం వ్యాపారవర్గాల్లో నెలకొన్నది.
కొన్ని కొత్త మద్యం కంపెనీలు తెలంగాణలో తమ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం తమ ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కంపెనీల నుంచి భారీగా కమీషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కో బాటిల్‌పై 10 నుంచి 20 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడున్న మార్కెట్ ధరతో పోలిస్తే కంపెనీలకు ఒక్కో బాటిల్ తయారీకి ఆ 10 నుంచి 20 శాతం ఖర్చే అవుతుండటంతో కమీషన్ చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్తున్నారు.
ఇవన్నీ సక్రమంగా జరిగితే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశమున్నది. అయితే ఈ వ్యవహారమంతటిలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తమ్ముడు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తం అతని కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియ అంతా పారదర్శకంగానే ఉన్నా.. ఆ కమీషన్‌ను డీల్ చేసేది మాత్రం ఆ తమ్ముడేనని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.
తెలంగాణలో వచ్చే కొత్త బ్రాండ్ల మద్యం ప్రజలకు ఏ మేరకు అలవాటువుతుందనే సంశయం మద్యం వ్యాపారవర్గాల్లో నెలకొంది. కొత్త బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం వస్తుందేమోనన్న ఆందోళన అటు మద్యం ప్రియుల్లోనూ వ్యక్తమవుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా నాణ్యమైన మద్యాన్ని విక్రయించిందని వినియోగదారులు చెప్తున్నారు. ఏదైనా బ్రాండ్ మీద వ్యతిరేకత వస్తే.. దానిని మద్యం ప్రియుల్లోకి ఎలా తీసుకెళ్లాలో అనే ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. కొత్త కంపెనీలు, కొత్త బ్రాండ్లు వస్తే తమకు కూడా కమీషన్ వచ్చే అవకాశం ఉండటంతో కొందరు ప్రభుత్వ పెద్దలే కావాలని మద్యం కృత్రిమ కొరతకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొత్త కంపెనీలను బూచిగా చూపించి పాత కంపెనీలను కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు వ్యాపారవర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.