Gurukula Recruitment | హైదరాబాద్, జూన్23 (నమస్తే తెలంగాణ): గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు బీసీ, ఎస్సీతోపాటు ఆయా సొసైటీలు కసరత్తును ముమ్మరం చేశాయి. జూలై వారాంతంలోపు పోస్టింగ్స్ అందజేస్తామని షెడ్యూల్ కూడా ప్రకటించాయి. సోమవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్నాయి. ట్రిబ్ ప్రకటించిన మెరిట్ జాబితాలో వివిధ క్యాడర్ పోస్టులకు సంబంధించి కొంతమంది అనర్హులున్నారని ఇప్పటికే అభ్యర్థులు వెల్లడించారు. ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారు. వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సదరు అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తారా? సొసైటీలు నిరాకరిస్తాయా? అని బాధిత అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
పీడీ జాబితాలో ఇద్దరు..
స్కూల్ పీడీ పోస్టులకు సంబంధించిన జాబితాలో ఇద్దరు అనర్హులున్నట్టు గురుకుల అభ్యర్థులు వాదిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకా రం 2023 ఏప్రిల్ 5 నాటికి ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలు పాసైన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. ఆ లెక్కనే గత మే నెల నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి. కానీ ప్రస్తుతం ట్రిబ్ అందుకు విరుద్ధంగా గత నవంబర్‌లో పాసైన ఇద్దరు అభ్యర్థులను పీడీ పోస్టులకు ఎంపిక చేసిందని అభ్యర్థులు వివరించడమేకాదు, సదరు అనర్హులకు సం బంధించిన హాల్‌టికెట్ నంబర్లను వివరిస్తున్నారు. అదీగాక ఇదేవిషయమై పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు.
లైబ్రేరియన్ పోస్టుల్లోనూ..
ఇదిలావుండగా, తాజాగా లైబ్రేరియన్ పోస్టుల్లో అనేకమంది అనర్హులను ట్రిబ్ ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం 418 లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాను ట్రిబ్ ప్రకటించింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం 2014 తరువాత ఇతర రాష్ర్టాల్లోని యూనివర్సిటీల్లో లైబ్రేరియన్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అనర్హులు. టీజీపీఎస్సీ దానిని అమలు చేస్తున్నది. టిబ్ మాత్రం ఆ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా పలువురు అనర్హులను లైబ్రేరియన్ పోస్టులకు ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆధారాలతో బహిర్గతపరిచారు. ఐదుగురు అభ్యర్థులను గుర్తించడంతోపాటు, ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించారు.
అదేవిధంగా, ఫీమెల్ క్యాండిడెట్ల పేరుపై మేల్ క్యాండిడేట్లను ట్రిబ్ ఎంపిక చేయడం కొసమెరుపు. డీఎల్ ఇంగ్లిష్, జేఎల్ ఫిజిక్స్ పోస్టులకు సంబంధించి ఆ జాబితాలో ఇద్దరిని ఫీమెల్ క్యాండిడేట్లుగా చూపించినా మేల్ క్యాండింట్లను తుది జాబితాలో ఎంపిక చేసింది. ఇంకా అనేక లోపాలను అభ్యర్థులు బయటపెట్టారు. ట్రిబ్ దృష్టికి కూడా తీసుకుపోయారు. అయితే సొసైటీలో మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని, జాబితాలో అనర్హులు ఉన్నట్లతే పోస్టింగ్స్ ఇవ్వబోమని ట్రిబ్ అధికారులు గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం సొసైటీలు మాత్రం అందుకుభిన్నంగా వాదనలు వినిపిస్తున్నాయి. ట్రిబ్ అందజేసిన జాబితా మేరకు అభ్యర్థులకు పోస్టింగ్స్ అందిస్తామని, తమకేమీ సంబంధం లేదని సొసైటీలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాబితాలోని అనర్హులకు పోస్టింగ్స్ అంశంపై గురుకుల అభ్యర్థుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.