హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఐదు డీఏల్లో ఒక్కటే ఇచ్చి ఉద్యోగులకు దీపావళి కానుక అని చెప్పుకోవడం విడ్డూరమని ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ విమర్శించారు. రెండు ఉద్యోగ జేఏసీలతో చర్చించిన సీఎం రేవంత్ కనీసం మూడు డీఏలు ఇస్తారని ఆశించారని, కానీ క్యాబినెట్ మీటింగ్‌లో ఒక్కటే విడుదల చేసి ఉద్యోగులను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం దీనితోనే ఉద్యోగులు సంతృప్తి చెందాలని మంత్రులు చెప్పడం హాస్యాస్పదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది డీఏ విడుదలకు అనుమతి కోసం ఈసీకి పంపించిందని ఆదివారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే డీఏను ఇవ్వాలని నిర్ణయించి తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆక్షేపించారు. అధికారంలోకి రాగానే డీఏలన్నీ విడుదల చేస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీ వేస్తామని మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్, పది నెలలు దాటుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులు, 317, సీపీఎస్ లాంటి సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నదని దుయ్యబట్టారు. మార్చి 24 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఆరు వేల మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్ ఇవ్వకుండా ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తున్నదని ఆరోపించారు.