(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ‘హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం. మన నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తాం’.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఆయన ఇచ్చిన హామీకి మించి తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. కేటీఆర్ చెప్పినట్టు ఐటీ ఎగుమతులు రెండురెట్లు కాదు.. ఏకంగా నాలుగింతలయ్యాయి. కొత్త ఉద్యోగాలు పది లక్షలకు చేరాయి. ఇదంతా కేసీఆర్ దార్శనికతతో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన వినూత్న ఐటీ పాలసీలు, నాటి ఐటీమంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైంది. ఈ విషయం 2023-24కుగాను ఐటీ ఎగుమతులకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమైంది. 2013-14లో అప్పటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు మాత్రమే ఉండేవి. అయితే, బీఆర్‌ఎస్‌పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగా 2023-24 ఏడాదినాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.2,72,075 కోట్లకు చేరింది. ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) కింద రాష్ట్రం నుంచి రూ.1,21,116 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) కింద మరో రూ.1,50,959 కోట్లు విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్టు కేంద్ర గణాంకాలు తెలిపాయి. 2023-24కు గాను దేశవ్యాప్తంగా మొత్తం ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 15.56 శాతం ఉన్నట్టు గణాంకాల్లో తేలింది. మొత్తం ఐటీ ఎగుమతుల్లో 65 శాతం వాటా దక్షిణాది రాష్ర్టాలదే కావడం గమనార్హం.
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో రాజకీయ సుస్థిరత, సమర్థ నాయకత్వానికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు తెలంగాణలో ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలిచాయి. దీంతో భారత ఐటీ రంగ స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతి ఏటా రెండు నుంచి మూడు రెట్లవరకూ ఎక్కువగానే ఉంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీలతో యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, గూగుల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్మ్యాన్సాచ్స్, జెడ్ఎఫ్, యూబీఎస్, పెప్సీ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. దీంతోపాటు ఫేస్బుక్, క్వాల్కామ్, అక్సెంచర్, వేల్స్ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలను విస్తరించాయి. హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా పుంజుకోవడంతో దీని ప్రభావం మిగతా రంగాలైన నిర్మాణ, రవాణా, సేవా, ఆతిథ్య, వినోద రంగాల వృద్ధికి తోడ్పాటునిచ్చింది. ఒక్క ఐటీ ఉద్యోగంతో పరోక్షంగా మరో నాలుగు ఉద్యోగాలు వస్తాయని నిపుణులు చెప్తారు. బీఆర్ఎస్హయాంలో 2023-24నాటికి ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్టు తేలింది. ఐటీ రంగం ఆధారంతో వివిధరంగాల్లో కొత్తగా 40 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయి. పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వడానికి టీఎస్ఐపాస్, టీఎస్‌బీపాస్ వంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టాస్క్‌తో ఐటీ కంపెనీల్లో ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయోగపడింది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఐటీ కంపెనీలు క్యూకట్టి ఎగుమతులు పెరగ్గా.. బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఐటీ ఎగుమతులు ఆశించిన మేర లేకపోవడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ చెబుతున్నా.. భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని కేంద్ర గణాంకాలే చెప్తున్నాయి. మోదీ సొంత రాష్ర్టామైన గుజరాత్లో 2023-24లో ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.14,926 కోట్ల మేర ఉన్నది. మరో డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. 2023-24లో రూ.79,497 కోట్లే ఐటీ ఎక్స్‌పోర్ట్స్ చేసింది. మొత్తంగా ఎన్డీయేపాలిత 14 రాష్ర్టాల్లోని మొత్తం ఐటీ ఎగుమతులను కలిపినప్పటికీ.. 2023-24లో తెలంగాణ ఎగుమతి చేసిన ఐటీ ఎగుమతుల కంటే తక్కువగానే ఉండటం విశేషం.