హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ‘కృత్రిమ మేధ(ఏఐ)తో ఉపాధి కోల్పోయే వారిని ఆదుకునేందుకు ఏఐ సంస్థలపై పన్ను విధించాలి. కాలుష్యానికి ‘కార్బన్ క్రెడిట్స్’ వసూలు చేసినట్టే, ఏఐ కంపెనీలకు ‘పీపుల్ క్రెడిట్స్’ పేరిట పన్ను విధించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ జపం చేస్తుంటే, ఏఐ ఆధారిత కంపెనీలను ఆకర్షించేందుకు దేశాలు, రాష్ర్టాలు పోటీ పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం తనదైన శైలిలో విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ శుక్రవారం నిర్వహించిన ‘ఏఐ పాలసీ సింపోజియం’లో వర్చువల్గా సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ‘ట్యాక్స్’ ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది ఆచరణ సాధ్యం కాని, ఏమాత్రం అవగాహన లేని ఆలోచన అంటూ ఐటీ రంగ నిపుణులు మండిపడుతున్నారు.
కంపెనీలు వెనుకడుగు వేసే ప్రమాదం
మల్టీ నేషనల్ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్దఎత్తున రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, సహా ఇతర ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీ ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏఐ కంపెనీలకు పోటీపడి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెట్టుబడులను ఆకర్షించడంలో తీవ్ర ఆటంకంగా మారుతాయని ఐటీరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రకటనలతో అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేసే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఐటీ కంపెనీల పెట్టుబడుల విషయంలో పోటీ నెలకొన్నదని గుర్తుచేస్తున్నారు. కంపెనీలను భయపెట్టేలా సీఎం చేసిన ప్రకటనతో కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ వేదికగా అభాసుపాలు
సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా మందిని అయోమయానికి గురిచేశాయని పేర్కొంటున్నారు. ఏఐని వినియోగించే బహుళజాతి ఐటీ కంపెనీలపై పన్ను వేయడం ఒక రాష్ర్టానికి సాధ్యమేనా? అని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఏఐ వాడితే శిక్ష వేస్తామన్నట్టుగా హెచ్చరిస్తే ఏ రాష్ట్రమైనా ఏఐ వాడే కంపెనీలపై పన్ను విధిస్తే, అక్కడికి వచ్చి ఎందుకు పెట్టుబడులు పెడతాయని పేర్కొంటున్నారు. ఇలాంటి అజ్ఞానపు ప్రకటనలతో అంతర్జాతీయ వేదికపై రాష్ట్రం పరువును మంటగలిపారని నెటిజన్లు మండిపడుతున్నారు.