CM Security | హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ ) : బెటాలియన్ పోలీసుల నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రతపై ఐఎస్డబ్ల్యూ (ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్) దృష్టి సారించింది. సీఎం ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులను తొలగించారు. వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల గార్డులను నియమించారు. ఆందోళనకారుల నుంచి ఎటువంటి ముప్పు తలెత్తకుండా ఉండేందుకు సెక్రటేరియట్ చుట్టూ 2 కిలోమీటర్ల పరిధి మేర పోలీసు ఆంక్షలు విధిస్తూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఏక్ పోలీస్ విధానం’ నినాదాలతో బెటాలియన్ పోలీసులు, వారి కుబుంబ సభ్యులు మెరుపు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న వారి కుటుంబ సభ్యులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సాటి పోలీసు కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు అనే కనికరం లేకుండా ఈడ్చుకుంటా అవతల పారేశారు. ఇది బెటాలియన్ పోలీసులను మానసికంగా తీవ్రంగా కలచి వేసింది.
తాజాగా ఆందోళనలకు బాధ్యులుగా గుర్తిస్తూ 10 మంది బెటాలియన్ పోలీసును ఏకంగా విధుల నుంచి తొలగించారు. దీంతో బెటాలియన్ పోలీసులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం వద్ద అంగరక్షకులుగా ఉన్న బెటాలియన్ పోలీసుల నుంచి తలనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పటిష్ట రక్షణ చర్యలు చేపట్టింది. సీఎం ఇంటికి అన్ని వైపులా భద్రతగా 8 ఔట్ పోస్టుల్లో దాదాపు 40 మంది గార్డులు పహారా కాస్తుంటారు. ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున మొత్తం మూడు షాఫ్టుల్లో 24 గంటల నిరంతర భద్రత ఉంటుంది. ఇప్పటి వరకు ఈ భద్రతను టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు చూస్తూ వచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాత్రికి రాత్రే ఇంటి భద్రతా బెటాలియన్ గార్డులను తొలగిస్తూ ఐఎస్డబ్ల్యూ నిర్ణయం తీసుకున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. సీఎం ఇంటి మెయిన్ గేట్ వద్ద, ఆయన కాన్వాయ్ సెక్యూరిటీలో దాదాపు 70 శాతం టీజీఎస్పీ పోలీసులే ఉంటారు. వీరిని వీవీఐపీకి సాధ్యమైనంత ఎక్కువ దూరంలో ఉంచాలని, ముందు వరుస సెక్యూరిటీ వింగ్లో ఆర్డ్ రిజర్వ్, గ్రే హౌండ్స్ బలగాలను ఉంచాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.