హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటు వ్యవహారం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. ప్రభుత్వం స్థలాల పరిశీలన, ప్రతిపాదనలు రూపకల్పన వరకే పరిమితమవుతున్నది తప్ప డ్రైపోర్ట్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. తాజాగా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో డ్రైపోర్ట్ ఏర్పాటు కోసం అధికారులు ప్రభుత్వ స్థలాలను పరిశీలించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఎగుమతులకు ఎక్కువగా ఈ రవాణా వ్యవస్థకే ప్రాధాన్యతనిస్తారు. నాగపూర్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని నిమ్జ్‌లో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎంతోకాలంగా ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు దీనిని పెడచెవిన పెట్టింది.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నది కానీ అది కార్యరూపం దాల్చడంలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ట్రిపుల్ ఆర్కు సమీపంలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొదటి డ్రైపోర్ట్ సంగారెడ్డి జిల్లా మనోహరాబాద్‌లో ఏర్పాటు కానున్నదని టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.
అధికారుల హడావుడి
మరోవైపు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు కేవలం 213 కిలోమీటర్ల పరిధిలో ఉండటంతోపాటు ఆ ప్రాంతం నుంచి నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. అలాగే, ఉత్తర, దక్షిణ తెలంగాణకు మధ్య జంక్షన్‌గా కూడా డోర్నకల్ ప్రాంతం ఉంది. డోర్నకల్ పరిధిలోని గుండ్రాతిమడుగు, బాలపాలెం, అమ్మపాలెం తదితర గ్రామాల పరిధిలో 400ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది.
ప్రభుత్వమే నిర్ణయించాలి
‘ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించాం. డ్రైపోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రభుత్వమే నిర్ణయించాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు, దీనికి కేంద్రం ప్రభుత్వం సహకారం తప్పనిసరి. లేకుంటే కార్యరూపం దాల్చడం కష్టం.’ అని ఓ అధికారి పేర్కొన్నారు.