హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ ద్వారా జారీచేసే ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ (ఎల్‌యూసీ)ల జారీ నిలిచిపోయింది. హెచ్ఎండీఏ పరిధిలో ఏ సర్వే నంబర్ ఏ జోన్ పరిధిలోకి వస్తుందనే సమాచారాన్ని టీఎస్‌బీపాస్ ద్వారా అధికారికంగా జారీ చేసేందుకు గతంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భూమి క్రయవిక్రయాలు జరిపేవారు ముందుగా అది వ్యవసాయ భూమా? పారిశ్రామికవాడకు సంబంధించిన భూమా లేక ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతించే జోన్లో ఉన్నదా? అనే వివరాలను ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ద్వారా పక్కాగా తెలుసుకునేందుకు వీలయ్యేది.
ఇందుకోసం రూ.1,000 ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా టీఎస్‌బీపాస్‌లో సర్వే నంబర్, గ్రామం, పట్టణం తదితర వివరాలను సమర్పిస్తే ఈ సర్టిఫికెట్‌ను జారీ చేసేవారు. కానీ, గత కొంత కాలంగా వీటి జారీని నిలిపివేశారు. దీంతో ఇప్పటికే ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు పేరుకుపోయాయి. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలోనే ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. హైడ్రా తీరు సమస్యాత్మకంగా మారడం, గతంలో అనుమతులు ఇచ్చి న అధికారులపై చర్యలకు ఒత్తిడి పెరుగుతున్నందు వల్లే ఈ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయిందని భావిస్తున్నారు.