హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆర్థిక సంస్థగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రైవేటు రంగ ఆర్థిక సంస్థల్లో అతి చిన్నదైన అదానీ క్యాపిటల్‌తో అవసరం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు. వీటి భాగస్వామ్యం నిజంగా రైతుల కోసమా? లేక అదానీ కోసమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ రెండు బ్యాంకుల లెక్కలను పరిశీలిస్తే వాటి భాగస్వామ్యం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికైనా సులభంగానే అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా 22 వేల శాఖలు, 64 వేల ఏటీఎంలు, రూ.48 లక్షల కోట్ల ఆస్తులు, 1.4 కోట్ల రైతు ఖాతాలను కలిగివున్న ఎస్బీఐ.. ఇప్పటివరకూ రైతులకు రూ.2 లక్షల కోట్ల రుణాలు ఇచ్చింది.
కేవలం 60 శాఖలు, రూ.13 వేల కోట్ల ఆస్తులు, 28 వేల రైతు ఖాతాలను కలిగివున్న అదానీ క్యాపిటల్.. ఇప్పటిదాకా రూ.1,300 కోట్ల రుణాలను మాత్రమే ఇచ్చింది. అలాంటప్పుడు అదానీ క్యాపిటల్‌తో ఎస్బీఐకి విచిత్రమైన బంధం ఎందుకు? దీని వెనుక రాజకీయ ఒత్తిడేమీ లేదంటారా?’ అని ప్రశ్నిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. దీనిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.