Indiramma House | కేశంపేట, ఏప్రిల్ 29 : ఇది ప్రజా పాలన.. ప్రజల ప్రభుత్వం.. పార్టీలకు అతీతతంగా పారదర్శకంగా పని చేస్తాం.. అర్హులైతే చాలు.. మీ ఇంటి గడప దాకా వచ్చి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తాం.. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఇల్లు లేనివారికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామంటూ వేదికలమీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు తలదించుకునే ఘటన కేశంపేట మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో వెలుగు చూసింది.
సంతాపూర్ గ్రామానికి చెందిన ఎండీ లాల్బీ తన భర్త సర్ధార్తో కలిసి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి మట్టి గోడలతో కూడిన పెంకుటింట్లో నివాసం ఉంటున్నారు. భారీ ఈదురు గాలులు, వర్షానికి వారు నివాసం ఉండే ఇల్లు కూలిపోవడంతో దిక్కులేనివారయ్యారని, కూలిన ఇంటిపైకప్పుకు కవర్ కప్పి కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు. కూలిన ఇంటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఎన్నో ఆశలతో ఉన్న ఆ కుటుంబం ఆశలు అడిఆశలయ్యాయి. లాల్బీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా లేరనే ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపిక కమిటీ సభ్యులు ఆ కుటుంబాన్ని అర్హుల జాబితాలో చేర్చలేదు. సంతాపూర్ గ్రామంలో లాల్బీ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరముందని, ఈ విషయమై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించాలని బీఆర్ఎస్ యువ నాయకుడు సాజిద్ కోరారు. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకపోవడంతో పల్లె ప్రజల్లో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.