రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికొస్తాయనుకునే సమయంలో బోర్లు ఎండిపోవడంతో పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేని రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలాలను పారిస్తున్నారు. ఒక్కో రైతు రోజుకు నాలుగు నుంచి ఐదు ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. సాగునీటి కోసం రైతుల రోజువారీగా రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కాగా, మరికొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నా నీళ్లు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 93 వేల ఎకరాల్లో వరి వేయగా.. ఇప్పటికే సుమారు 20 వేల ఎకరాల వరకు ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. పదిహేను రోజుల్లో మరింత ఎండిపోయే ప్రమాదం ఉన్నదని, పదిహేను రోజులు దాటితే తప్ప తాము బయటపడే అవకాశం లేదని రైతులు చెప్తున్నారు.
నేను రెండెకరాలు కౌలుకు తీసుకుని ఆకు కూరలు వేసిన. పదిహేను రోజుల కిందటి వరకు బోరులో నీళ్లు ఉండటంతో పొలాన్ని అచ్చుకట్టి పీకెలు చేసిన. పీకెలలో పాలకూర, ఇతర ఆకు కూరలు వేసిన. రెండ్రోజుల నుంచి బోరుమొత్తం ఎండిపోయింది. నీరు రావడంలేదు. ఆగి ఆగి కొద్దిపాటి నీరుపోస్తున్నది. రోజంతా పైపులు పట్టుకుని కూర్చున్నా.. పీకె కూడా పారడంలేదు.