Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందించడం కష్టమేనని అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్న ది. ఎస్సారెస్పీ స్టేజీ-2కు నీరివ్వాలంటే ఎగువన ఆయకట్టుకు నీరివ్వలేమని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం గా మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సాగునీటి వినియోగానికి ప్రస్తుతం 365 టీఎంసీలు అందుబాటులో ఉండగా, వాటితో దాదాపు 42 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని స్టేట్ లెవల్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) సమావేశాన్ని ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో మంగళవారం జలసౌధలో నిర్వహించారు. టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజినీర్లు చేసిన ప్రతిపాదనలపై కమిటీలో చర్చించారు. డిసెంబర్ మూడో వారం నుంచి సాగునీటి విడుదలకు సన్నద్ధం కావాలని ఇంజినీర్లకు కమిటీ సూచించింది.
ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, మిడ్‌మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూర్, నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర మేజర్ ప్రాజెక్టుల్లో రానున్న జూన్ నెలాఖరునాటికి తాగునీటి అవసరాలు పోగా, ప్రస్తుతం 285.34 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని కమిటీ లెక్కతేల్చింది. ఆయా ప్రాజెక్టుల కింద 30.58 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించింది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 33.03 టీఎంసీలతో, 2.68 లక్షల ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 37.40 టీఎంసీలతో 72.23 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్ట్‌ల కింద 9.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చర్చించారు. మొత్తంగా 365.28 టీఎంసీలు అందుబాటులో ఉండగా, 42.11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇందులో తడి పంటలు (వెట్ క్రాప్స్) 24.19 లక్షల ఎకరాలు, ఆరు తడి పంటలు (ఐడీ క్రాప్స్) 17.92 లక్షల ఎకరాలు ఉండటం గమనార్హం.
రంగనాయకసాగర్ ఆయకట్టుకు అనుమానమే
రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహ ణ కమిటీ సమావేశంలో ప్రధానంగా రంగనాయకసాగర్ ఆయకట్టుపై చర్చించినట్టు సమాచారం. ప్యాకేజీ 10, 11, 12, జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి, ఉప్పరపల్లి కాలువల కింద మొత్తంగా దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రతి యాసంగి సీజన్లోనూ రాజరాజేశ్వర జలాశయం నుం చి అనంతగిరి, అక్కడి నుంచి రంగనాయక్సాగర్కు జలాలను తరలించి సాగునీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది సాగునీటిని అందించలేమని కమిటీలో అధికారులు చేతులేత్తారు. ఎస్సారెస్పీ నుంచి దిగువకు ఆశించిన మేరకు జలాలు వచ్చే పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలో ఎల్ఎండీ దిగువనున్న ఆయకట్టుకు రాజరాజేశ్వర జలాశయం నుంచే జలాలను అందించాల్సి ఉంటుందని, అక్కడి నుంచి ఎగువన అనంతగిరి, రంగనాయకసాగర్‌కు నీటిని అందించలేమని అధికారులు కమిటీలో అభిప్రాయం వ్యక్తంచేసినట్టు సమాచారం.