Congress Party | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిపాలనా భవనమైన సచివాలయం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే గాంధీభవన్‌గా మారిపోయింది. గాంధీభవన్‌లో జరగాల్సిన కార్యక్రమాలను మంత్రులే సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ చేరికల కార్యక్రమానికి సచివాలయాన్ని వేదికగా మార్చేశారు. సూర్యాపేటకు చెందిన పలువురు ఇతర పార్టీల కౌన్సిలర్లు, నేతలు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి ఉత్తమ్‌కుమార్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అక్కడ గ్రూప్ ఫొటో కూడా దిగారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన భవనాన్ని పార్టీ భవనంగా మార్చడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలోని తన చాంబర్లో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా పార్టీ చేరికల కార్యక్రమాన్నే నిర్వహించారు. ఇక మున్ముందు ఇలాంటివి మరెన్ని చూడాల్సి వస్తుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై పార్టీ, పాలన కార్యక్రమాలన్నీ సచివాలయంలోనే చేస్తారేమో అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.