హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్‌శాఖలో ఇటీవల ప్రమోషన్లు కల్పించారన్న మాటేగానీ ఇంకా చాలా స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. తొమ్మిది ఇరిగేషన్ సర్కిల్స్‌కు చీఫ్ ఇంజినీర్లే లేకుండా పోయారు. ఉన్న సీఈలకే అదనపు బాధ్యతలను అప్పగించి ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. దీంతో పాలన అంతా గాడితప్పుతున్నదని ఇంజినీర్లు వాపోతున్నారు. ఇరిగేషన్‌శాఖలో మొత్తంగా 19 సర్కిల్స్ ఉండగా, అన్ని విభాగాల్లో 23 సీఈ పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 13 మందికిపైగా సీఈలు పదవీ విరమణ చేశారు. ప్రమోషన్ల ద్వారా ఆ ఖాళీలను భర్తీచేయాలని ఇంజినీర్లు అనేకసార్లు విన్నవించగా, గత ఆగస్టులో ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసింది. అయితే కొత్తగా ప్రమోషన్ పొందినవారితోపాటు, దాదాపు 11మంది సీఈలు ఇప్పటికే విరమణ పొందారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, గజ్వేల్, కరీంనగర్, ఆదిలాబాద్ సీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈ రఘునాథ్‌రావు సైతం పదవీ విరమణ చేశారు.
సూర్యాపేట సీఈగా కొనసాగుతున్న రమేశ్‌బాబుకే ఈఎన్సీ అడ్మిన్‌గా, ఖమ్మం సీఈగా, ఆదిలాబాద్ సీఈకి ఈఎన్సీ ఓఅండ్ఎంగా బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ సీఈకి కరీంనగర్ ఈఎన్సీగా, వరంగల్ సీఈకి కొత్తగూడెం సీఈగా, మహబూబ్‌నగర్ సీఈకి హైదరాబాద్, కామారెడ్డి సీఈకి సంగారెడ్డి, సీఈ ఎంక్వయిరీస్కు ఐఎస్డబ్ల్యూఆర్ సీఈ, ఈఎన్సీ జనరల్‌లోని ఎస్ఈకే జాయింట్ సెక్రటరి (టెక్నికల్)గా, గజ్వే ల్ ఎస్ఈకి సీఈగా ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉంటే ప్రమోషన్లను కల్పించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఇష్టారీతిన అధికారులకు బాధ్యతలను అప్పగిస్తున్నది. వాస్తవంగా ఈఎన్సీ, సీఈ, ఎస్ ఈ, ఈఈ ఇలా ఏ పోస్టు ఖాళీ అయినా వెంటనే సీనియారిటీ జాబితాలో అక్కడే ఉన్న ఇంజినీర్‌కు, అక్కడ సీనియర్ ఇంజినీర్ లేకుంటే ఆ బాధ్యతలను పక్కనే ఉన్న ఇతర సీఈ, ఎస్ఈ, ఈఈలకు అప్పగించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ సర్కారు ఆ నిబంధనలకు తిలోదకాలిచ్చింది. నచ్చినోళ్లకు, పైరవీలు చేసినోళ్లకే బాధ్యతలను అప్పగిస్తున్నది. ఏడాది కాలంలో 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్లను పకన పెట్టి 2005, 2007 బ్యాచ్‌లకు చెందిన పదుల సంఖ్యలో ఇంజినీర్లను ఉన్నతస్థానాల్లో ఎఫ్ఏసీలుగా నియమించారని బాధిత ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు.
టెరిటోరియల్ సీఈ, సర్కిల్, డివిజన్ ఇంజినీర్ల పోస్టులు కీలకమైనవి. ఆయా ఇంజినీర్లు తమ పరిధిలోని ప్రాజెక్టుల పర్యవేక్షణ, పనుల నిర్వహణ, ఇతరత్రా బాధ్యతలను నిర్వర్తించడానికే సమయం సరిపోని పరిస్థితి. అదనంగా మరొక టెరిటోరియల్, సర్కిల్, డివిజన్ బాధ్యతలను కూడా నిర్వర్తించాలంటే చాలా కష్టం. అలాంటిది ప్రస్తుతం ఇరిగేషన్‌శాఖలో పలువురు ఇంజినీర్లు లెక్కకు మించి అదనపు బాధ్యతలను, భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోపుతున్నది. దీంతో సాగునీటి పారుదలశాఖ పాలన మొత్తం గాడి తప్పుతున్నదని సీనియర్ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తుండగా, ఎక్కడ ఏ మేరకు, ఎప్పుడు, ఎవరు విడుదల చేస్తున్నారో తెలియని దుస్థితి. ఇంజినీర్ల మధ్య ఆహ్లాదకర వాతావరణం లేకుండాపోవడంతోపాటు గ్రూపులుగా విడిపోయిన దుస్థితి నెలకొన్నది. ఉన్నతస్థానాల్లో బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారికి దిగువనున్న సీనియర్ ఇంజినీర్లు సహకరించని పరిస్థితి నెలకొనగా, పరోక్షంగా సహాయ నిరాకరణ పాటిస్తున్నారని పలువురు బాహాటంగానే వాపోతున్నారు.