HYDRA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): హైడ్రా.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశం. ఆరంభంలో ఆదర్శంగా అనిపించిన ఈ ఏజెన్సీ అడుగులు క్రమేణా వివాదాస్పదంగా మారుతున్నాయి. కూల్చివేతలను ఎవరూ తప్పు పట్టడంలేదు. కానీ ఎంపికలోనే అసలు మర్మం దాగి ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్షసాధింపులకు హైడ్రా పావుగా మారుతుందనే విమర్శలకు నానాటికీ బలం చేకూరుతుంది.
హైడ్రా పరిధి ఎక్కడి వరకు ?
హైడ్రా కూల్చివేతల పర్వంలో భాగంగా గండిపేట ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలని వేసిన అడుగులు అనుమానాల నిప్పును రాజేశాయి. వాస్తవానికి గత నెల 19న ప్రభు త్వం హైడ్రాకు సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఔటర్‌ను పరిధిగా నిర్ధారించి, గ్రామాల పేర్లు సహా పొందుపరిచింది. కానీ హైడ్రా యంత్రాంగం ఔటర్ రింగు రోడ్డు దాటి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మం డలం హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలో ఉన్న కావేరీ సీడ్స్ కంపెనీ భవనాన్ని కూల్చివేసింది. అదేమంటే.. గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నందున కూల్చివేసినట్టు స్పష్టం చేసింది. పరిధిదాటి ఎందుకు పోయారనే దానిపై నేటికీ స్పష్టత కరువు. తాజాగా శనివారం సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నేలమట్టం చేశారు. దీనిపై ఈ నెల 21న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫిర్యా దు చేశారు.
ఎఫ్టీఎల్లో నిర్మించినందున కూల్చివేసినట్టు ఆధారాలతో హై డ్రా ప్రకటన చేసింది. కానీ ఎన్ కన్వెన్షన్‌పై నీటిపారుదల శాఖ చెరువులో కబ్జా అయినట్టుగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఘట్కేసర్ మండలం వెంకటాపురం పరిధిలోని నాదం చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు ఉన్నాయని అనురాగ్ యూనివర్సిటీ భవన సముదాయంపై నీటిపారుదల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ తమ్మిడికుంట వ్యవహారంలో రాష్ట్ర మంత్రి ఫిర్యాదు చేస్తే, ఇక్కడ నాదం చెరువుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది. ఇందులో ఒకరు సినీ ప్ర ముఖుడు కాగా… మరొకరు ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యుడు. దీంతో హైడ్రా అడుగు లు ఎటువైపు పడుతున్నాయనేది సుస్పష్టం. ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే హైడ్రా ప్రతిష్ఠ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.