అశ్వారావుపేట, జూన్ 29 : చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని దొంతికుంట చెరువు నుంచి వ్యవసాయ భూమిలోకి మట్టి తరలించేందుకు ఓ రైతు ఇరిగేషన్ ఏఈఈ ఎల్ శ్రీనివాసరావును సంప్రదించాడు.
ఇందుకోసం రైతును రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.2 లక్షలకు అంగీకరించాడు. ఈ మేరకు సోమవారం అశ్వారావుపేటలోని ఇరిగేషన్ కార్యాలయంలో రైతు నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏఈఈ శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.