పెన్సిల్ గీత వారికి రూ.కోట్లను కురిపిస్తున్నది. పేపర్‌పై మార్కింగ్ పడిందంటే చాలు కచ్చితంగా కాసులు రాలుతాయి. అలా అని వారేమీ పేరుపొందిన ఆర్టిస్టులో, చేయితిరిగిన చిత్రకారులో కాదు. కేవలం సబ్ రిజిస్ట్రార్లు మాత్రమే. రిజిస్ట్రేషన్ శాఖలో ఈ సైన్ లాంగ్వేజ్ ఇప్పుడు వాటాల గుట్టు విప్పుతున్నది. ఒక్కో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌పై పెన్సిల్‌తో వేసే ఒక్కో కోడ్.. రోజువారీ మామూళ్ల లెక్కలు తేలుస్తున్నది
హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు గమనించండి.. రిజిస్ట్రేషన్‌కు ముందు డాక్యుమెంట్ పైభాగంలో పెన్సిల్‌తో ఓ కోడ్ కనిపిస్తుంది. అవేంటో కాదు కాసుల కోడ్లు. ఆ కోడ్లను బట్టే పైసా వసూల్ ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ల ఆదేశాల మేరకు ఆ కోడ్‌ను బట్టే డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన వారి వద్ద నుంచి ముక్కుపిండి మరీ అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రకమైన కోడ్ వేస్తుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే సాధారణ కోడ్. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కోడ్ భాష మారుతుంది.. చెల్లించే పైకమూ పెరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్‌కు, డాక్యుమెంట్ రైటర్‌కు, కొనుగోలు లేదా విక్రయదారులకు మధ్య ‘ఒప్పందం’ కుదిరితేనే ఆ గీతను చెరిపేస్తారు.
ఆ డాక్యుమెంట్‌పై రాసిన గీత చెరిగిపోతేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒప్పందంలో ఏ మాత్రం తేడా వచ్చినా డాక్యుమెంట్ పక్కకు పోతుంది. రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. డాక్యుమెంట్ రైటర్లు వారి కస్టమర్ ప్రాపర్టీ కొనుగోలు, విక్రయాలపై డాక్యుమెంట్లను సిద్ధం చేసి సబ్ రిజిస్ట్రార్ల ముందు పెట్టి వివరిస్తారు. అక్కడ పరిస్థితిని బట్టి సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌పై పెన్సిల్‌తో కోడ్ భాషలో రాస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ రైటర్ బయటకు వచ్చి ‘సార్ ఇది రాశారు. ఇంత మొత్తం అడుగుతున్నారు’ అని కష్టమర్లకు చెప్పేస్తారు.
ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరిస్తే ప్రాసెస్ ముందుకెళ్తుంది. లేదంటే డాక్యుమెంట్ పెండింగ్‌లో పడుతుంది. ఒకవేళ ఏమైనా కారణాలతో తర్వాత రోజు వెళ్తే.. డాక్యుమెంట్‌పై ఉన్న ‘కోడ్’ ఖరీదు మరింత పెరుగుతుంది. ఆ తర్వాత ఒప్పందం కుదిరితే డాక్యుమెంట్‌పై కోడ్ చెరిగిపోతుంది. వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లేదంటే అంతే సంగతి.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఒక్కో డాక్యుమెంట్‌పై రాసిన ఒక్కో కోడ్‌కు ఒక్కో ధర నిర్ణయిస్తున్నారు. రూ.5 వేలు మొదలుకొని రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ఇటీవల అల్వాల్ పరిధిలోని తన ఇంటిని విక్రయించిన ఓ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. ఆ ఇంటిని సెట్‌బ్యాక్ లేకుండా, అధిక విస్తీర్ణంలో నిర్మించారని కొర్రీ పెట్టారు. ఒక్కో చదరపు అడుగుకు లెక్కలేసి రూ.లక్ష ఖరారు చేశారు. ఈ మేరకు ఆ ఆఫీసులోనే ఉన్న ఓ షాడో వ్యక్తి డాక్యుమెంట్ రైటర్‌కు సమాచారం ఇచ్చారు.
డాక్యుమెంట్ రైటర్ బయటికొచ్చి ‘ఎస్ఎఫ్టీ ఎక్కువగా ఉన్నందున రిజిస్ట్రేషన్ చేయనంటున్నారు. లేదంటే ఇంటినంబర్ వచ్చాక రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు’ అని కష్టమర్‌కు తేల్చిచెప్పారు. దీనికి పరిష్కారం ఏమిటని ఆయన అడగ్గా ‘ఆఫీసులో రూ.లక్ష చెప్తున్నారు. ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది’ అని ఈజీగా చెప్పారు. చేసేదేమీలేక ఆ మొత్తం ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల మరో ఘటన జరిగింది. ఓపెన్ ప్లాట్‌కు సంబంధించి అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ ఎల్ఆర్ఎస్ పాతది అనే కారణంతో రూ.5వేలు అదనంగా వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విధంగా కోడ్‌కో రేటు నిర్ణయించి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి కొంత తక్కువగా ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భారీగా అవినీతి దందా సాగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 40 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతికి అంతేలేకుండా పోతున్నదని బహిరంగంగానే ఎందరో చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారి నుంచి ఇక్కడ రోజూ ఒక్కో ఆఫీసులో సగటున రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. అంటే రోజూ రూ.80 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
కాస్త ఎక్కువ సమస్య ఉన్న డాక్యుమెంట్ వస్తే ఈ వసూళ్లు రూ.కోటికి చేరుతాయనే చర్చ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రోజూ రూ.కోట్లలో అదనపు వసూళ్ల దందా నడస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఇవన్నీ మాకు మాత్రమే కాదు. కింది నుంచి హెడ్ ఆఫీసులోని పెద్ద సార్లకు, ఆపై పెద్దసార్లకు కూడా వెళ్తాయి’ అన్న మాట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వినిపిస్తున్నది. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూలు చేసే అక్రమ సంపాదనలో పెద్దలకు కూడా వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయి సర్కారుకు ఆదాయం తగ్గినా.. వీళ్ల ఆదాయానికి మాత్రం కొరత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కీలక అధికారులు తమ తరఫున వసూళ్ల కోసం ప్రత్యేకంగా తమకు అత్యంత నమ్మకంగల, దగ్గరి వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కీలక అధికారుల తరఫున ‘కోడ్’ వసూళ్లు, చర్చలంతా వీరే చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లోని అడ్డా పెట్టి మరీ ఈ అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్‌కు ఇంత అని రేటు నిర్ణయిస్తారు. సాయంత్రం కాగానే సదరు ప్రైవేటు వ్యక్తి వసూళ్లు ప్రారంభిస్తాడు. ఏ డాక్యుమెంట్ రైటర్ ఎంత ఇవ్వాలో లెక్కలేసి వసూళ్లు చేసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఎవరికి ఎంత ముట్టాలో అంత పంపకాలు జరిగిపోతాయి.