‘అడిగినంత డబ్బు ముట్టజెప్పు.. కావాల్సిన ప్రమోషన్ పట్టు. నచ్చిన చోటుకు వెళ్లు’ ఇదీ స్వయంగా సీఎం రేవంత్ అజమాయిషీలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల సొసైటీ పరిధిలోని డీఎల్, ప్రిన్సిపాళ్ల ప్రమోషన్లు, బదిలీల తీరు. ఓ అధికార పార్టీ నాయకుడు, ఓ యూనియన్ లీడర్, ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ చక్రం తిప్పి కోట్లు దండుకున్నారు. సమస్యలను చక్కదిద్దాల్సిన అధికారులే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు సదరు వ్యక్తులతోనే రావాలని బాహాటంగా సూచించారు. వెరసి అనుభవం, అర్హతలున్నా ప్రమోషన్లు రాక కొందరు బలైతే, మరికొందరు స్థానికతనే కోల్పోయారు. ఈ వ్యవహారంపై సీఎస్‌కు ఫిర్యాదు చేసి 15రోజులు దాటినా ఇప్పటికీ చర్యల్లేవని ఉద్యోగులు వాపోతున్నారు
Congress Govt | మ్యాకం రవికుమార్/హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 30 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 3 ప్రత్యేక డిగ్రీ కాలేజీలు మినహా 27 మహిళా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 1017 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2017, ఆ తర్వాత 2019లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టింది. తాజాగా 2022లో డీఎల్ పోస్టులు మంజూరు చేయగా, ఇటీవలే నియామకం చేపట్టింది.
విధివిధానాలంటూ ఏమీలేకుండానే సొసైటీ ఇష్టారాజ్యంగా డిగ్రీ లెక్చరర్ల బదిలీలు నిర్వహించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సంబంధించి వేర్వేరుగా సూపరింటెండెంట్లను నియమించి బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టిన సొసైటీ, డీఎల్‌కు సంబంధించి అలాంటి చర్యలేమీ చేపట్టలేదు. కనీస అర్హతలు లేనివారిని ఇన్చార్జిలుగా నియమించి ప్రక్రియను మమ అనిపించింది. ఇదే అదునుగా సదరు ఉన్నతాధికారులు అక్రమాలకు తెరలేపారని తెలుస్తున్నది.
వాస్తవంగా డిగ్రీ గురుకుల కాలేజీల్లో 2019 మార్చి, అదే ఏడాది ఆగస్టు, తాజాగా ఇటీవల నియామకాలు చేపట్టారు. 2019, 2020లో రిక్రూట్మెంట్ అయినప్పుడు మెరిట్ ప్రకారం ఆయా డీఎల్ సబ్జెక్టులకు సంబంధించి 80శాతం మంది వాళ్ల దగ్గరి ప్రాంతాల కాలేజీలను ఎంచుకున్నారు. కేవలం 20శాతం అంటే దాదాపు 170 మంది వరకు తమకు వచ్చిన మెరిట్ ఆధారంగానే దూరప్రాంతాల్లో పోస్టింగ్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఐదేండ్లుగా ఇబ్బందులు పడుతున్న వారంతా రిక్వెస్ట్ బదిలీలు సైతం పెట్టుకున్నారు. ఇక 317జీవో కారణంగా మరికొద్దిమంది డిగ్రీ లెక్చరర్లు స్థానికతను కోల్పోయారు.
వాస్తవంగా ఇక్కడ విషయం ఏమిటంటే మెరిట్ ఆధారంగా డిస్లొకేట్ అయినవారికి, 317జీవో బాధితులకు ఎక్కడా సంబంధం లేదు. ఒకరు మెరిట్ ఆధారంగా స్థానికతను కోల్పోతే, మరొకరు 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయారు. కానీ సొసైటీ మాత్రం ఇక్కడ వేర్వేరుగా పరిగణించకుండా 317, మెరిట్ ఫలితంగా డిస్లొకేట్ కేసులన్నింటినీ ఒకే ఘాటన కట్టి ప్రమోషన్, ట్రాన్స్ఫర్లకు సీనియార్టీ లిస్ట్‌ను రూపొందించడం గమనార్హం. అభ్యర్థులు పెట్టుకున్న అప్లికేషన్లలోనే ఆర్ఎల్1 (రిక్రూట్మెంట్ 1బ్యాచ్), ఆర్ఎల్2 బ్యాచా? అపాయింట్మెంట్ ఎక్కడ? సొంత ప్లేస్ ఎక్కడనేది సర్టిఫికెట్ల ద్వారానే తెలుస్తుంది.
కానీ అవేవీ చేయకుండా కామన్ సీనియార్టీ పేరిట, నచ్చిన వారికి, అడ్డదారిలో వచ్చిన వారికి కోరుకున్న చోటుకు, కాలేజీకి నిబంధనలకు విరుద్ధంగా జోన్లకు జోన్లనే మార్చి పోస్టింగ్‌లు ఇచ్చారు. అర్హతలున్నా, మెరిట్ ఉన్నా కూడా అనేక మందిని దూరప్రాంతాలకు నెట్టేశారు. సొంత జోన్లలో ఉన్నవారిని సైతం తాజా బదిలీల్లో ఇతర జోన్లకు పంపించారు. డిస్లొకేట్ అయినవారిని సొంత ప్రాంతాలకు పంపి న్యాయం చేయాల్సింది పోయి మరింత అన్యాయానికి గురిచేయడం చర్చనీయాంశంగా మారింది. బాధిత అధ్యాపకులంతా ఇప్పుడు కన్నీటిపర్యంతమవుతున్నారు.
బదిలీల సంగతి అంటుంచితే డిగ్రీ గురుకుల కాలేజీల ప్రిన్సిపాళ్ల పోస్టుల ప్రమోషన్లలోనూ సొసైటీ పూర్తిగా నియమనిబంధనలకు పాతరేసింది. సొసైటీ 2020లో మొత్తంగా 19 డిగ్రీ ప్రిన్సిపాల్ పోస్టులను నోటిఫై చేసింది. వాటిలో 8 పోస్టులే భర్తీ అయ్యాయి. 11 పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా ఆ పోస్టులతోపాటు అదనంగా మరో 6 పోస్టులు కూడా మంజూరుకాగా మొత్తంగా 17 పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. సొసైటీ బైలాస్ ప్రకారం వీటిలో 30శాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారా, 70శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా పూర్తిగా 100శాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారానే సొసైటీ భర్తీ చేసింది.
డీఎల్, ప్రిన్సిపాల్ పోస్టులను సీనియార్టీ ఆధారంగా నింపిన చరిత్ర సొసైటీలోనే కాదు, దేశ విద్యావ్యవస్థలోనే ఎక్కడా లేదు. డీఎల్ పోస్టు బోధనకు సంబంధించినదయితే, ప్రిన్సిపాల్ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించింది. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం 15 ఏండ్ల టీచింగ్ అనుభవం, పీహెచ్డీ, సమర్పించిన రీసెర్చ్ పత్రాలు తదితర అకడమిక్ ఫర్మార్మెన్స్ ఇండెక్స్ (ఏపీఐ) ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలి. ఇదే యూజీసీ గైడ్‌లైన్స్‌నే పాటించాలని అన్ని సొసైటీలకు తెలంగాణ ప్రభుత్వం 2019లో జీవో 15ను విడుదల చేసింది. కానీ సొసైటీ ఆ నిబంధనలన్నీ తుంగలో తొక్కిపెట్టి, అర్హతలను పరిశీలించకుండానే కేవలం కామన్ సీనియార్టీ ఆధారంగా ప్రమోషన్లు కల్పించింది.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే సోషల్ వెల్ఫేర్‌లో మొత్తం మహిళా డిగ్రీ కాలేజీలే ఉన్నాయి. మహిళా గురుకులాల్లో మహిళా టీచర్లనే నియమించాలనే నిబంధన ఉన్నది. కానీ ఆ నిబంధనకు సొసైటీ పాతరేసింది. నోటిఫై చేసిన పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లను కూడా ప్రమోషన్లలో కల్పించలేదు. అర్హులకు ఇచ్చారా? అంటే అదీ లేదు. సొసైటీ బైలాస్‌ను కూడా తుంగలోతొక్కి 100శాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. అలా చేయాలంటే సంబంధిత మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, మినిస్ట్రీ, ఇద్దరు ఎడ్యుకేషనలిస్ట్లు, రెండు యూనియన్ల మెంబర్లు, అక్కడున్న సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాళ్లు ఇలా జీబీ మెంబర్లు కూర్చుని నిర్ణయాలు తీసుకుని తీర్మానించాలి.
జీబీలో నోట్ చేసి ఆ తర్వాత చేపట్టాలి. ఆ మినట్స్ నోట్‌ను ప్రమోషన్ ఆర్డర్లో రెఫరెన్స్ ఐడీగా చూపాలి. కానీ అదేమీ లేకుండా సొసైటీ నిర్వహించింది. కేవలం డిపార్ట్మెంటల్ టెస్ట్, కామన్ సీనియార్టీ లిస్ట్‌ను ఫాలో అవుతున్నామని చెప్పి స్కూల్ ఎక్స్పీరియన్స్ వాళ్లను తీసుకొచ్చి డీఎల్ ప్రిన్సిపాళ్లుగా ప్రమోషన్ కల్పించడం గమనార్హం. ఈ తతంగం వెనుక పెద్దమొత్తంలో చేతులు మారాయని డీఎల్ అభ్యర్థులు వెల్లడిస్తున్నారు.
డీఎల్ ప్రిన్సిపాల్ ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన మొత్తం వ్యవహారంలో అధికారపార్టీకి చెందిన కీలక నాయకుడు, సొసైటీకి చెందిన ఓ యూనియన్ నాయకుడు, ఓడీల మీద పనిచేసిన ఇద్దరు ఉన్నతాధికారులు, ఒక డాటా ఆపరేటర్ కలిసి అక్రమాలకు తెరలేపారని అధ్యాపకులే బాహాటంగా చెబుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం డీఎల్ ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ తీసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ డిగ్రీ లెక్చరర్‌తోపాటు, మరో పీడీ నెల రోజుల పాటు ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా సొసైటీ ప్రధాన కార్యాలయంలో నెల పాటు తిష్ట వేసి ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ లిస్ట్‌లను రూపొందించడం గమనార్హం.
సూటిగా చెప్పాలంటే ప్రమోషన్ లిస్ట్‌లో ఉన్న టీచరే ప్రమోషన్ల ప్రక్రియను నిర్వహించిన చరిత్ర సొసైటీలో ఉండడం గమనార్హం. లక్షల్లో వసూలు చేసి డీఎల్ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, న్యూ నియామకాలు అన్నింటినీ చక్కబెట్టారని విశ్వసనీయ సమాచారం. అక్రమాల కోసమే ఎక్కడ ఎన్ని మంజూరు పోస్టులున్నాయి? వేకెన్సీలున్నాయి? అనేవి స్పష్టంగా చూపించలేదు. సీనియార్టీ జాబితాలను ఏకంగా మూడు సార్లకు మించి మార్చారు. నచ్చిన వారికి, డబ్బు ముట్టజెప్పినవారికి ప్రమోషన్లు, బదిలీలు కల్పించేందుకు డాటా ఆపరేటర్‌ను అడ్డంపెట్టుకుని కావాలని క్లరికల్ మిస్టేట్స్కు పాల్పడ్డారు.
అభ్యర్థుల వివరాలనే గోల్మాల్ చేయడం కొసమెరుపు. డీఎల్ ఒక్కటే కాదు జేఎల్, పీజీటీ, టీజీటీ బదిలీలు, ప్రమోషన్లలోనూ ఇదే తంతు కొనసాగిందని, ఒక్కో పోస్టుకు 5-10లక్షల వరకూ చేతులు మారాయని తెలుస్తున్నది. మొత్తంగా 5 కోట్ల మేర కుంభకోణం జరిగిందని సొసైటీ టీచర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియలో అన్యాయానికి గురైన టీచర్లు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నచ్చిన ప్లేస్‌కోసం ప్రమోషన్ వదులుకుంటే చివరికి ఆ చోటు దక్కక, ప్రమోషన్ కూడా చేజారి కన్నీటి పర్యంతమవుతున్నారు. అర్హతలుండి, మెరిట్ ఉండీ ప్రమోషన్లు రాక, జోన్లు ఎందుకు మారాయో తెలువక, అడిగితే చెప్పేవారు లేక, కుటుంబాలకు దూరమై మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇదేమని అడిగితే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్‌పై సస్పెన్షన్ చేస్తామని సొసైటీ ఉన్నతాధికారులు బాధిత టీచర్లపై బెదిరింపులకు దిగడం గమనార్హం.
బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఎవరూ హెడ్ ఆఫీస్‌కు రావద్దని ఆంక్షలు విధించడమే కాకుండా అలా ఎవరైనా వస్తే సంబంధిత ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేస్తామని సెక్రటరీయే స్వయంగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న శాఖలో ఇంతగా అక్రమాలు జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు. సీఎస్‌కు ఫిర్యాదు చేసినా, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా ఫలితం లేకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లపై డిపార్ట్మెంట్కు చెందిన విజిలెన్స్, లేదంటే ఏసీబీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కారు స్పందించకుంటే మూకుమ్మడిగా తరలివచ్చి సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని సోషల్ వెల్ఫేర్ గురుకుల టీచర్లు హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయమై సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణిని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించింది. అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై వివరణ కోరగా అలాంటిదేమీ లేదని ఆమె తెలిపారు. ప్రమోషన్లు, బదిలీలను నిబంధనలకు అనుగుణంగా చేపట్టామని వివరించారు. తప్పులు ఎక్కడ జరిగాయో టీచర్లు చూపాలని, రాసివ్వాలని సూచించారు. కోర్టు ఆదేశాలతో సొసైటీకి పనిలేదని, సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సొసైటీకి ఉన్నదని వెల్లడించారు.