తెలంగాణ ప్రభుత్వంలో వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. పొద్దున నిద్రలేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకూ ఏదో ఒక రూపంలో సైబర్ నేరాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరికో ఒకరికి సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై హితబోధ చేస్తూనే ఉంటారు. అలాంటి సీనియర్ ఐపీఎస్‌ల కుటుంబీకులే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. వారు నష్టపోయింది కూడా వేలు, లక్షలు కాదు.. ఒకరి కుటుంబం కోటిన్నర వరకు కోల్పోతే.. మరికొందరి కుటుంబసభ్యులు లక్షల్లో నష్టపోయారు.
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు సీనియర్ ఐపీఎస్‌ల కుటుంబీకులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని లక్షల రూపాయలు తస్కరించిన ఘటనలు విస్మయం కలిగిస్తున్నాయి. దీనిపై తెలంగాణ పోలీసుశాఖ సైతం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేకపోయింది. ఇప్పటికి నాలుగైదు ఘటనలే వెలుగులోకి రావడంతో.. ఇంకెంతమంది ఐపీఎస్‌ల కుటుంబీకులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారోనన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వెలుగులోకి రూ.2 కోట్ల మోసం..
సైబర్ నేరగాళ్లు కేవలం నెల వ్యవధిలోనే నలుగురు ఐపీఎస్‌ల కుటుంబీకులను లక్ష్యంగా చేసుకున్న రూ.2.20 కోట్ల నగదును దోచుకునన్నట్టు తెలిసింది. ఓ మహిళా సీనియర్ ఐపీఎస్ అధికారి కుటుంబీకులు రూ.1.6 కోట్లు నష్టపోగా.. తెలంగాణలో ప్రముఖ సిటీకి కమిషనర్‌గా ఉన్న మరో సీనియర్ ఐపీఎస్ కుటుంబం సుమారు రూ.16 లక్షల వరకు కోల్పోయింది. ప్రస్తుతానికి ఆ నగదును ఫ్రీజ్ చేయించినట్టు తెలిసింది.
ఇక మూడు కీలక పోస్టులను నిర్వహిస్తున్న మరో మహిళా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబం సైతం రూ. 5లక్షలు వరకు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయినట్టు సమాచారం. వీరికితోడు ఓ ఆర్మీ అధికారి కుటుంబం ఏకంగా రూ.40 లక్షల వరకు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టింది. ఈ తాజా ఘటనల్లో కొంత డబ్బును మాత్రం సకాలంలో ఫ్రీజ్ చేశారని తెలిసింది. దీంతో కానిస్టేబుళ్ల నుంచి సీనియర్ ఐపీఎస్‌ల వరకూ తమ కుటుంబీకులను సైబర్ నేరాలపట్ల అప్రమత్తం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
స్టాక్‌మార్కెట్ ప్రాఫిట్స్ పేరుతో
స్టాక్ మార్కెట్లోకి కొత్త పెట్టుబడి అవకాశాలు వచ్చాయని, 2000 శాతం లాభాలు వస్తాయని ఆశపెట్టి సైబర్ నేరగాళ్లు ఐపీఎస్‌ల కుటుంబీకులను బుట్టలో వేసుకున్నట్టు తెలిసింది. ఈ మధ్య ఈ తరహా మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు తాము చెప్పిన కంపెనీల్లోనే స్టాక్స్ కొనేలా పెట్టుబడులు పెట్టించి.. నిండా ముంచుతున్నారు. ఇక ఆర్మీ అధికారి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి న్యూడ్‌కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎరవేశారని సమాచారం.
ఈ క్రమంలో అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఇతర ఆర్మీ అధికారులకు, బంధువులకు పంపుతామని బెదిరించి రూ.40 లక్షలు కాజేసినట్టు తెలిసింది. కనీసం ఇంటర్ కూడా పాస్ కాని సైబర్ దొంగలు.. ఉన్నత విద్యావంతులను స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ పేరుతో మోసం చేయడం.. అందులోనూ కీలక పోస్టుల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ల బంధువులను లక్ష్యంగా చేసుకోవడం విస్మయం కలిగిస్తున్నది. విద్యావంతులైనా, నిరక్షరాస్యులైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి కాల్ చేస్తే.. ఆ డబ్బు ఇతర ఖాతాలకు బదిలీకాకుండా చూస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.