హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): ఆర్యజననీ, ఆర్కే మఠ్ ఆధ్వర్యంలో ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచిన స్వామి వివేకానంద ఆలోచనలు ఎంతటి శక్తిమంతమో నేటి తరానికి తెలపాలనే సంకల్పంతో ఈ క్విజ్ పోటీలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
వివేకానందుడు బోధించిన కర్మయోగ సిద్ధాంతం ఆధారంగా ఈ క్విజ్ పోటీలు ఆన్లైన్లో జరుగుతాయని తెలిపారు. 18 నుంచి 30 ఏండ్ల యువతీ యువకులు అర్హులుగా పేర్కొన్నారు. విజేతలకు 30 లక్షలకు పైగా స్కాలర్షిప్ అందజేస్తామని, 120 పేజీలు ఉన్న కర్మయోగి పుస్తకాన్ని పఠిస్తే ఈ క్విజ్‌లో విజేతగా నిలువొచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 15 వరకు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న మొదటి రౌండ్ పోటీలు జరుగుతాయని తెలిపారు.