KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ నివేదికలు ఒక్కొక్కటిగా వెబ్సైట్ల నుంచి మాయమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలన, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరొచ్చేలా ఉన్న రిపోర్టులు రాత్రికి రాత్రే డిలీట్ అవుతున్నాయి. కొన్ని వెబ్సైట్లు ఓపెన్ కూడా కావడం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024 కూడా కనిపించడం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) నివేదిక కూడా వెబ్సైట్ నుంచి ఇప్పటికే డిలీట్ అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు గత పాలన, ప్రస్తుత పాలనకు సంబంధించిన నివేదికలను విడుదల చేస్తాయి. ప్రతి నివేదికలోనూ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అద్భుతమని వెల్లడవుతున్నది. దీనిని ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కారు జీర్ణించుకోలేకపోతున్నది. నాటి కేసీఆర్ పాలనా ప్రగతి, ప్రస్తుత ఏడాది పాలనా వైఫల్యం గణాంకాలతోసహా బహిర్గతమైతే కాంగ్రెస్ సర్కారు అసమర్థత ప్రజలకు తెలిసిపోతుందని భయపడుతున్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ చరిత్రను చెరిపేస్తామని గతంలో రేవంత్ చెప్పినట్టుగా డిజిటల్ కంటెంట్‌ను కొన్ని అదృశ్య శక్తులు కనిపించకుండా చేస్తున్నాయి.
పదేండ్ల అభివృద్ధికి అద్దంపట్టాయి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024 కేసీఆర్ పాలనలో జరిగిన పదేండ్ల అభివృద్ధికి అద్దంపట్టింది. 2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2023-24లో 196 శాతం వృద్ధితో రూ.15,01,981 కోట్లుగా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. దేశ జీడీపీ, తలసరి ఆదాయం, ధాన్యం ఉత్పత్తి, సాగు విస్తీర్ణం వంటి అంశాల్లో గణనీయ అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం సాధించింది. స్పష్టమైన గణాంకాలతో ఉన్న ఆ నివేదిక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ (అట్లాస్) వెబ్సైట్లో కనిపించడం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) నిర్వహించింది. గతంలో ఎన్నడూలేని విధంగా 36 గంటల వ్యవధిలోనే ఎస్కేఎస్ జరిపింది. దాని ఆధారంగా పథకాలు అమలుచేసి ప్రజలకు న్యాయం చేసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన సర్వే లెక్కలు ఎస్కేఎస్, ఎన్నికల కమిషన్ ఓటరు లిస్టుతో పోల్చినప్పుడు జనాభా భారీగా తగ్గింది. ఎస్కేఎస్ సర్వే రిపోర్టుతోనే తమ వైఫల్యం, బండారం బయటపడిందని ప్రభుత్వం భావించినట్టున్నది. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రసంగం తర్వాత నుంచి ఎస్కేఎస్ నివేదిక వెబ్సైట్లో కనిపించకుండా పోయింది.
అట్లాస్ నివేదిక అందుబాటులో పెట్టండి: బీఆర్ఎస్
తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ (అట్లాస్).. వెబ్సైట్ (tgdps.telangana.gov.in)లో కనిపించడం లేదని, మంగళవారం ఎంత ప్రయత్నించినా యాక్సెస్ కాలేదని బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ తెలిపారు. నివేదికను ప్రజలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ‘తెలంగాణ సిద్ధించిన తొలి దశాబ్దంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధించింది. అనేక రిపోర్టులు కేసీఆర్ పాలనా తీరుకు అద్దంపట్టాయి. అలాంటి నివేదికలు నేడు వైబ్సైట్లలో కనిపించడం లేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. కొన్ని అనైతిక శక్తులు వాటిని కనిపించకుండా చేసినట్టు అనిపిస్తున్నది. 2014-2023 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో వచ్చిన పురోగతిని ప్రతిబింబించే వేలల్లో ఉన్న ఫొటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తొలగించారు. ఈ ప్రభుత్వ డిజిటల్ ఆస్తుల ధ్వంసంపై విచారణ జరిపించండి’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దిలీప్ కోరారు.
కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం
ఏ లక్ష్యంతో అయితే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామో 2014-23 మధ్య కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆ దిశగానే అడుగులు వేసింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని పెంచుకున్నది. 2014-15లో రూ.29,288 కోట్లు ఉంటే 2021-22 నాటికి రూ.92,910 కోట్లు పెరిగింది. సొంత రాబడిలో మూడు రెట్లు పెరిగి దేశంలోనే అగ్రపథాన నిలిచింది. రాష్ట్ర తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగింది. 2013-14లో ఉన్న రూ.1,12,162 కోట్ల నుంచి 2021-22 నాటికి రూ.2,75,445 కోట్లకు పెరిగింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వ్యవసాయం, ఐటీ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక తదితర రంగాలు ఉన్నత శిఖరాలకు చేరాయి. ఈ విషయాన్ని వివిధ నివేదికలు గణాంకలతో సహా వెల్లడించాయి. పదేండ్ల కేసీఆర్ పాలనా ప్రగతి రాకెట్లాగా పైకి దూసుకెళ్తే, ఏడాది రేవంత్‌రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్, వాణిజ్యం, పన్నుల రాబడి, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది. ఈ గణాంకాలన్నీ డిజిటల్ రూపంలో ఆయా శాఖల వెబ్సైట్లలో ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వానికి పేరు తెచ్చేలా ఉన్న నాడు పొందుపర్చిన తెలంగాణ ప్రగతి నివేదికలను ఈనాడు వెబ్సైట్ల నుంచి తొలగిస్తున్నారు.