Weather Updates | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులపై ఒకప్పుడు తమ శాఖ ఇచ్చే అంచనాలు తప్పేవని, కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో కచ్చితమైన అంచనాలను అందిస్తున్నామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ కే నాగరత్న పేర్కొన్నారు. సుడిగాలులు, పిడుగులు, తుఫాన్లు, అతివృష్టి, అనావృష్టి వంటి విపత్కర పరిస్థితులను ముందస్తుగా అంచనా వేయడంలో ప్రపంచ దేశాలకు దీటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత వాతావరణ శాఖ ఉపయోగిస్తున్నదని చెప్పారు. తుఫాన్లు, రుతుపవనాల గమనాలను గుర్తించడంలో అమెరికా కంటే మనమే ముందున్నామని తెలిపారు. ఐఎండీలో కూడా డాటా స్టోరేజీ కోసం కృత్రిమ మేథ (ఏఐ)ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి అనుసరిస్తున్న పద్ధతులపై డాక్టర్ నాగరత్న ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
‘గతంలో వాతావరణ శాఖ అంచనాలు వేసే పద్ధతులన్నీ ఆఫ్‌లైన్‌లో ఉండేవి. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగంతో ఆన్లైన్ విధానం పెరిగింది. అన్ని విషయాలలో ‘ఛాయా చిత్రాల’ వినియోగం అందుబాటులోకి వచ్చింది. అబ్జర్వేషన్స్ పెరిగాయి. శాటిలైట్ ద్వారా చిత్రాలు అందుతున్నాయి. దీంతో క్ష్రేత్రస్థాయి సమాచారం వేగంగా చేరుతున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకొని, అంచనాలను వేగంగా రూపొందించగలుగుతున్నాం.
గతంలో దేశవ్యాప్తంగా ఒకటి, రెండు రాడార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రాడార్ల నుంచి సమాచారం సేకరిస్తున్నాం. వాతావరణ మార్పులపై అధ్యయనం పెరిగింది. దేశంలో 50 ప్రధాన కేంద్రాలు, సబ్డివిజన్లు, జిల్లాస్థాయి, బ్లాక్‌స్థాయి, నగర స్థాయిలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తున్నాం. ప్రధాన కేంద్రాలు, సబ్ డివిజన్లు, జిల్లా స్థాయిలో వాతావరణ పరిస్థితుల అంచనాల్లో 100 శాతం కచ్చితత్వం ఉంటున్నది.
వాతావరణాన్ని అంచనా వేయడంలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. యానిమేటెడ్ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. చల్లనిగాలుల తీవ్రత (కోల్డ్వేవ్స్)ను 10-15 నిమిషాల్లోనే కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాం. ఈ సమాచారం విపత్తుల శాఖకు చేరేసరికి 2-3 గంటలు ఆలస్యం అవుతున్నది. దీన్ని గుర్తించి డిసిషన్ సిస్టమ్‌ను పెంచుతున్నాం. సమాచారాన్ని వాట్సాప్ ద్వారా వేగంగా చేరవేస్తున్నాం. ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా అందిస్తున్నాం.
తుఫాన్లను గుర్తించేందుకు సముద్రంలో 24 గంటల మార్పులను గమనిస్తుంటాం. రాడార్లు, శాటిలైట్లు అందించే సమాచారాన్ని పరిశీలిస్తాం. సముద్ర ఉష్ణోగ్రత ఆధారంగా తుఫాన్ల తీవ్రతను అంచనా వేస్తాం. సముద్ర తీర ప్రాంతంలో, సమీప పట్టణంలో, సమీప ప్రాం తాల్లో ముందస్తు హెచ్చరికలు జారీచేస్తాం. దేశంలో కామన్ ఎలర్ట్ ప్రోటోకాల్ సిస్టమ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ఆరు వాతావరణ హెచ్చరికల కేంద్రాలున్నాయి. న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రతి రోజు నాలుగు సార్లు షార్ట్ టైం వాతావరణ అంచనాలు వేస్తాం. వాతావరణ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి రిపోర్ట్లు రూపొందిస్తాం.రాష్ట్రంలో హైదారాబాద్‌తో పా టు ఆదిలాబాద్, భద్రాచలం, హనుమకొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం సెంటర్ల నుంచి వాతావరణ సమాచారం సేకరిస్తాం.
పిడుగులు పడే పరిస్థితులను గుర్తించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఒక ప్రాంత ఉష్ణోగ్రత, కేప్, మాయిశ్చర్స్, సైన్ల వంటి అంశాలు పిడుగులు పడే పరిస్థితిని వెల్లడి స్తాయి. కేప్ (సముద్రం, భూమి నుంచి తలెత్తే తరంగాలు), సైన్ (కేంద్రం) సమాచా రం, మైక్రోఫిజిక్స్లో మార్పులు జరుగుతాయి. పారామీటర్స్, ఉరుములు, మెరుపుల ఆధారంగా 80-90 శాతం కచ్చితత్వాన్ని నిర్ధారించే మాడ్యూల్స్ అందుబాటులో ఉ న్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి వాటిని పరిశీలిస్తూ, మార్పులను అంచనా వేస్తుం టాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉష్ణమండల పరిస్థితులు ఉం టాయి. అభివృద్ధి చెందిన దేశాలు అంచనాలను లెక్కించేందుకు ఉపయోగించే పరికరాలు చాలా విలువైనవి ఉన్నప్పటికీ.. ఐఎండీ కూడా వాటికి దీటుగా ఉపయోగిస్తున్నది.
ఎల్‌నినో పరిస్థితులు 7, 8 సంవత్సరాలకు ఒకసారి తలెత్తుతాయి. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఎల్‌నినో ఉత్పన్నమవుతుంది. ఎల్‌నినో ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. ఎల్‌నినో ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం 60 శాతం తక్కువగా ఉంటుంది. లానినో వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువ వర్షపాతం పడుతుంది.