Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఇటు నగరం లోపల, అటు శివారులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శివారులో మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ధార్’ గ్యాంగ్, సిటీలోపల ‘చుడీదార్’ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నాయి. శివారులో గేటెడ్ కమ్యూనిటీలను ధార్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుండగా నగరంలోని అపార్ట్మెంట్లను చుడీదార్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నాయి. ఆరు నెలల ముందువరకు హైదరాబాద్‌వైపు చూడాలంటేనే భయపడ్డ అంతరాష్ట్ర దొంగలు, ఇప్పుడు నగరంలో చొరబడి యథేచ్ఛగా దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. ఇండ్లలో చోరీలు, రాత్రిపూట ఒంటరిగా వెళ్లేవారి నుంచి సెల్ఫోన్లు, నగదు, ఆడవారి నుంచి మంగళసూత్రాలు దోచుకెళ్తున్నారు. కాగా పలుచోట్ల జరిగిన దొంగతనాలతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న గ్యాంగ్ సభ్యుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని శివారు ప్రజలకు సూచించారు.
దొంగిలించిన సొత్తు స్వస్థలాలకు
మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ నగర శివారు ప్రాంతాల్లోనే మకాం వేసినట్టు పోలీసులు గుర్తించారు. నలుగురరైదుగురు ఈ గ్యాంగ్‌లో సభ్యులుగా ఉంటారు. ఉదయం కాలనీల్లో ఆటోల్లో తిరుగుతారు. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని రాత్రిపూట చోరీలకు పాల్పడుతారు. లాడ్జీల్లో బస చేస్తారు. దొంగిలించిన సొత్తును వివిధ మార్గాల్లో వెంటనే తమ స్వస్థలానికి చేరుస్తారు. నలుగురైదుగురు గుంపుగా ఉండి చోరీలు చేస్తారు. ఎవరైనా అడ్డొస్తే దాడులు చేస్తారు. ఇటీవల హయత్‌నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఐదు ఇండ్లలో దొంగతనాలు చేశారు. ఇది ధార్ గ్యాంగ్ పనేనని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలోని ఓ అపార్టుమెంట్లోకి ఇద్దరు చుడీదార్ వేసుకొని ప్రవేశించి తాళం వేసిన ఇంట్లో చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో వీరి కదలికలను పోలీసులు గుర్తించారు. ఇద్దరిలో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ అని అనుమానిస్తున్నా ఇప్పటివరకు ఆచూకీని మాత్రం కనుగొనలేదు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం
ఇటీవల హయత్‌నగర్ ఠాణా పరిధిలో వరుస దొంగతనాలు జరిగాయి. పోయిన సొత్తు విలువ చాలా తక్కువే ఉంటుంది. దొంగల కోసం గాలిస్తున్న క్రమంలో కొంత సమాచారం అందింది. ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ పనే అని గుర్తించాం. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కాలనీల్లో తిరిగితే స్థానిక పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచిస్తున్నాం. పోలీసులు అలర్ట్ అయ్యారనే సమాచారంతో దొంగలు హైదరాబాద్‌ను వదిలేసినట్టున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ గ్యాంగ్‌లను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నది.
-డీసీపీ అరవింద్‌బాబు, రాచకొండ క్రైమ్స్