గద్వాల అర్బన్ : ఆర్టీఐ ఏజెంట్లుగా చెలామని అవుతూ నకిలీ ధ్రువపత్రాలు(Fake certificates) సృష్టించి ఇన్సురెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు(Police) పట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ కే.సృజన(SP Srujana) మీడియాకు వివరాలు వెల్లడించారు.
ముఠాలో ముఖ్యుడిగా ఉన్న మీసాల రామస్వామి గతంలో ఏపీలోని కర్నూల్లో ఆర్టీఐ ఏజెంట్(RTI Agent)గా పనిచేశాడు. ఈ సమయంలో కంప్యూటర్‌పై పరిజ్ఞానం పెంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో దేశీయ, విదేశీ ఇన్సురెన్స్‌కు చెందిన వివిధ కంపెనీల లోగోలను డౌన్లోడ్ చేసుకున్నాడని వివరించారు. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో చెలామనిని ప్రారంభించాడు. కర్నూల్, నంద్యాల, అనంతపూర్, తెలంగాణలో జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని వాహనాల విలువ మేరకు ఒక్కొక్కరి వద్ద రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసేవాడని పేర్కొన్నారు.
వచ్చిన ఆదాయంలో 50 శాతం మేరకు సమాన వాటా ఏజెంట్లకు చెల్లించేవాడని వెల్లడించారు. వాహనాలకు కావాల్సిన ఫిట్నెస్(Fitness), ట్రాన్స్‌పోర్టు పర్మీషన్ల(Transport Permission)కు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్(Drivining License)లు సైతం నకిలీ పత్రాలు తయారు చేస్తూ రోజురోజుకు రంగాన్ని విస్తరిస్తూ వచ్చాడు. నకిలీ ధ్రువపత్రాల దందా పెద్ద మొత్తంలో సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అలంపూర్ సీఐ సూర్యనాయక్, ఉండవల్లి ఎస్సై బాలరాజు, సిబ్బంది బుధవారం సాయంత్రం కొందరిని అదుపులోకి తీసుకుని విచారింగా ముఠా వ్యవహరం వెలుగులోకి వచ్చిందన్నారు.
ఉండవల్లి పోలీస్ స్టేషన్లో సుమోటో కేసు(Sumoto Case)గా నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకున్నారని ఎస్పీ వెల్లడించారు. ఏ-1గా మీసాల రామస్వామితోపాటు చంద్రకుమార్, రవికుమార్, మాధవస్వామి, శ్రీకాంత్, సుధాకర్, తెలుగు విశ్వనాథ్, తెలుగు మధుసూదన్, రంగన్న, షఫీ, కోళ్ల ప్రేమ్‌కుమార్, పొత్తిలి సురేశ్‌గౌడ్, బోయిని నగేశ్, కొట్ర లక్ష్మయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘునాథ్, దాసరి ప్రవీణ్‌ను అరెస్టు చేశారు.
వీరి నుంచి కారు, రెండు కలర్ ప్రింటర్స్, నకిలీ ఆర్సీలు, ఇన్సురెన్స్ ధ్రువపత్రాలు, నకిలీ స్టాంపులు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని రిమాండ్ కోసం అలంపూర్ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.