హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద దవాఖాన ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్రావుతో కలిసి సదస్సు ప్రారంభించారు. 500మందికిపైగా స్పైన్ సర్జన్లు సదస్సుకు హాజరయ్యారు.
గోపీచంద్ మాట్లాడుతూ.. క్రీడల్లో గాయపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని, ముఖ్యంగా వెన్నెముక సమస్యలు, నడుము నొప్పులు సర్వసాధారణమైపోయాయని తెలిపారు. ఇలాంటి సమస్యలకు ఆధునిక చికిత్సతో పరిష్కారం లభిస్తున్నదని పేర్కొన్నారు. యశోద ఎండీ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. మినిమల్లీ ఇన్వాసివ్ అండ్ ఎండోస్కోపీ స్పైన్ సర్జరీలో వైద్య విభాగం ఎంతో పురోగతి,వైద్య విజ్ఞాన శాస్త్రంలో అధునిక మార్పులు, ఆవిష్కరణలపై దృష్టిసారించేందుకు ఈసదస్సు దోహదపడుతుందని చెప్పారు.