పెద్దపల్లి టౌన్ జూన్ 15: పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గపోరు రాజుకున్నది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కాషాయపార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ వైఖరిపై ఐదు మండలాల అధ్యక్షులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ అసలు జిల్లా అధ్యక్షుడే కాదని, ఆయన చేపట్టిన మండలాధ్యక్షుల నియామకాలు చెల్లవని తేల్చిచెప్పారు. గురువారం పెద్దపల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్ బీజేపీ మండలాధ్యక్షులు శనిగరం రమేశ్, పరుస సమ్మయ్య, యెల్లంకి రాజు, మామిడాల రమేశ్, జంగ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజేందర్ తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నుంచి చేరిన వారికి పార్టీ మండలాధ్యక్షుల పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్ వైఖరిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కర్రె సంజీవరెడ్డి, పిన్నింటిరాజు, కాసర్ల జనార్దన్‌రెడ్డి, జంగ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.