హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పాత జిల్లా (ఉమ్మడి జిల్లా)ల్లో సర్వీసుకు పాయింట్లు కేటాయించి బదిలీలకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన సర్వీసుకు పాయింట్లు జిల్లాల విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల బదిలీలకు కేటాయించాలని సోమవారం జస్టిస్ కే శరత్ ఆదేశించారు. జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించిన టీచర్లకు ఆ విధంగా చేయాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన సర్వీసు పాయింట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పలువురు టీచర్లు 50కిపైగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ జీవో ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించిన వారికి రెండేండ్ల సర్వీస్ నిబంధన వల్ల పిటిషనర్లు నష్టపోతున్నారని వారి తరఫు న్యాయవాదులు ఎం రాంగోపాల్‌రావు, డీ బాలకిషన్‌రావు ఇతరులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి విచారణను వాయిదా వేసింది.