(స్పెషల్ టాస్క్ ఫోర్స్)
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2019లో తొలుత సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఆరు రోజులు, ఆ తరువాత కుమారస్వామి సర్కార్‌ను కూలదోసి గత మూడున్నరేండ్లుగా అక్కడ అధికారం చలాయిస్తున్నది. అటు కాంగ్రెస్ నుంచి ఇటు జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా మెజారిటీ తెచ్చుకున్న బీజేపీ సర్కార్ ప్రస్తుతం పీకలదాకా అవినీతిలో కూరుకుపోయింది. 40% కమీషన్ సర్కారు అన్న ముద్ర పడింది. ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చినప్పటికీ ప్రజలు బీజేపీ పాలనను ఈసడించుకుంటున్నారు. మరోవైపు సీఎం బొమ్మై, మాజీ సీఎం యెడియూరప్ప మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోగల విశ్వాసం ఇటు రాష్ట్ర నాయకత్వంతోపాటు అటు అధిష్ఠానంలో కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నది.
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గ్రూపుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇటీవల తారస్థాయికి చేరుకున్నాయి. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, కాంగ్రెస్ దానిని సొమ్ము చేసుకునే పరిస్థితిలో లేదు. ఈ రెండు పార్టీల పట్ల జనానికి విశ్వాసం సన్నగిల్లడంతో మరో ప్రత్యామ్నాయం వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్టు పరిశీలకులు పేర్కొంటున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్), తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కొత్త జాతీయ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పట్ల జనం ఆసక్తి చూపే అవకాశం ఉన్నదని పరిశీలకులు అంటున్నారు.
జేడీఎస్-బీఆర్ఎస్ పొత్తు కీలకమవుతుందా?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌కు 37 సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే హైదరాబాద్-కర్ణాటక (కళ్యాణ కర్ణాటక) జిల్లాల్లోని 40 సీట్లు అత్యంత కీలకం కానున్నాయి. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బీదర్, యుద్గీర్, రాయచూర్, కొప్పాల, కలబురిగి, బళ్లారి-విజయపుర జిల్లాల్లో తెలుగువారు, ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్‌కు చెందిన (తెలంగాణ) వారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో జేడీఎస్‌కు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోడయితే మెజార్టీ సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జేడీఎస్‌కు ఉన్న 37 సీట్లకు ఈ 40 సీట్లు తోడయితే ఈ కూటమి 70 నుంచి 80 స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉంటుందని ప్రాథమిక అంచనా. అప్పుడు ఏ పార్టీ అయినా జేడీఎస్-బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.