హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : పరీక్షలంటేనే ఎక్కడా లేని భయం.. టెన్షన్.. ఒత్తిడి విద్యార్థులను ఆవహిస్తుంది. విద్యార్థుల్లో సహజంగా ఉండే ఈ టెన్షన్‌ను తొలిగించేందుకు.. వారికి భరోసా ఇచ్చేందుకు ఇంటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్ (హెల్ప్) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. సర్కారు జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు సహకారంతో వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ట్రైనింగ్ సెషన్లు(శిక్షణా కార్యక్రమాలను) నిర్వహిస్తున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుం చి 25 వరకు జరుగనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 307 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో హెల్ప్ శిక్షణా తరగతులు నిర్వహించారు. దీనికి 50వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు టెలిమానస్ సేవలను ఇంటర్‌బోర్డు అం దుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు 14416 లేదా 1800 -914416 నెంబర్లను సంప్రదించవచ్చు.
మీ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నరు! ; అధికారులు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల పిల్లల చదువులపై ఆరా
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య, ఇంటర్బోర్డులో పనిచేస్తున్న అధికారులు, లెక్చరర్లు, సిబ్బంది పిల్లలు ఇంటర్ ఎక్కడ, ఏ కాలేజీలో చదువుతున్నారోనని ఇంటర్‌బోర్డు ఆరా తీస్తున్నది. తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో.. ఏ కోర్సు చదువుతున్నారో.. ఆయా వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఓ ప్రొఫార్మాను పంపించి, బుధవారంలోగా సంబంధిత వివరాలు సమర్పించాలని పేర్కొంది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, నోడల్ అధికారులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, బోధన, బోధనేతర సిబ్బంది అంతా ఇంటర్ చదువుతున్న తమ పిల్లల వివరాలు నిర్ధేశిత ప్రొఫార్మాలో పంపించాలని ఆదేశాలిచ్చింది. మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ పిల్లలకు సహకరిస్తారన్న అనుమానాలు రావడం సహజం. అనుకూలమైన చోట సెంటర్లు వేయించుకోవడం, కాపీయింగ్‌కు సహకరిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. దీనికి తొలి దశలోనే అడ్డుకట్టవేయడంలో భాగంగా ముందుగానే ఆయా విద్యార్థుల వివరాలు బోర్డు సేకరిస్తున్నది. పరీక్షల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చన్న ఆలోచనతో బోర్డు ఈ చర్యలు చేపట్టింది.