మొయినాబాద్, జూలై 7 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో గల సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలను ప్రభుత్వం గోశాల కోసం సేకరించేందుకు ప్రతిపాదించిన భూముల్లో సోమవారం భూమి పూజచేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేను అడ్డుకోవడంతోపాటు జేసీబీకి అడ్డుతగలడంతో పోలీసులు వారిని నెట్టేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రైతులు ఒప్పుకోకపోవడంతో బలవంతంగానైనా ఆ భూములను తీసుకోవాలని సర్కారు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆ భూముల్లో పనులను ప్రారంభించేందుకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో భూమి పూజ చేయించారు. భూమి పూజకు ముందే రైతులతో పరిహారం విషయాన్ని మాట్లాడిద్దామని రెవెన్యూ అధికారులు భావించారు. తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఆదివారం రైతులకు ఫోన్ చేసి.. సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతారని రైతులకు సమాచారమిచ్చారు.
రైతులకు చెప్పిన సమయం కంటే ముందే ఎమ్మెల్యే భూముల వద్దకు రావడంతో ఆయనతో అధికారులు భూమి పూజ చేయించారు. తమకు చెప్పిన సమయం కంటే ముందే భూమి పూజ ఎలా చేస్తారని… తమతో పరిహార విషయం చర్చించకుండానే భూములను ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉన్నదని భావించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు.. ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించేశారు. పరిహారం తేల్చకముందే ఎలా భూములను స్వాధీనం చేసుకుంటారని ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఓవైపు రైతులు ఆందోళన చేస్తుండగానే మరో వైపు జేసీబీలతో అధికారులు భూమిలోని చెట్లను తొలగించే ప్రయత్నం చేయగా.. అన్నదాతలు అడ్డుకున్నారు. కర్రలతో జేసీబీని కొట్టడంతో పోలీసులు కోపోద్రిక్తులై వారిని తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.