ISIS | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్ (ISIS) కుట్ర చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎన్ఐఏ, తెలంగాణ, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసినట్టు తెలిసింది. ఏపీలోని విజయనగరంలో తీగలాగితే హైదరాబాద్‌లో డొంక కదిలిందని సమాచారం. సౌదీ నుంచి ఐసిస్, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఇస్తున్న ఆదేశాలతో ఇక్కడ కుట్రకు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరంలోని సిరాజ్ ఉర్ రెహ్మాన్(29) అనే యువకుడిపై కొన్ని రోజులుగా నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. అతడి ప్రవర్తన, ఆన్లైన్ చాటింగ్స్, ఆన్లైన్ కొనుగోళ్లు తదితర విషయాలను గుర్తించి తీవ్ర అనుమానాస్పదంగా ఉండడంతో అతని ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లో ప్రమాదకరమైన రసాయనాలు, పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు కావాల్సిన ముడిసరుకులు లభించినట్టు సమాచారం.
సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో హైదరాబాద్‌కు ఉన్న లింక్‌లు బయటపడ్డాయని తెలిసింది. హైదరాబాద్ బోయిగూడకు చెందిన లిఫ్ట్ ఆపరేటర్ సయ్యద్ సమీర్(28)తో సిరాజ్ ఈ విషయంపై చర్చించినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ మేరకు ఎన్ఐఏ తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సమీర్‌ను అదుపులోకి తీసుకొని విజయనగరం తరలించినట్టు తెలిసింది. ఈ ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లకు ఫ్లాన్ వేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పేలుడు పదార్ధాలకు కావాల్సిన ముడిసరుకును ఆన్లైన్లోనే కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు, నిఘా సంస్థలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత తర్వాత పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర శిబిరాలను అపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు యువతను తమ వైపు తిప్పుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు, నిఘావర్గాలు చెప్తున్నాయి. పాకిస్థాన్ నుంచే కాకుండా ఉగ్రవాదుల తమ అనుబంధ సంస్థలు, సానుభూతి పరులు వివిధ దేశాలలో ఉంటూ తమ కార్యకలాపాలను సాగించేందుకు అవకాశాలున్నాయని నిఘావర్గాలు భావిస్తున్నాయి.