హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : పాస్‌పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణలో గతేడాది 4వ స్థానంలో ఉన్న తెలంగాణ మళ్లీ మొదటిస్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో పాస్‌పోర్టు దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ద్వారా తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ బీ శివధర్‌రెడ్డి అవార్డు, ప్రశంసాపత్రం అందుకోనున్నారు. పోస్టుపోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పోలీసులు ముందు వరసలో నిలిచారు. పోలీసు ధ్రువీకరణలో ఎలాంటి తప్పులు జరగకుండా ‘వెరీఫాస్ట్’ యాప్ ద్వారా వెరిఫికేషన్ చేపడుతున్నారు. దీంతో పాస్‌పోర్ట్ ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతంగా, కచ్చితంగా, పారదర్శకంగా జరుగుతున్నది.
భారత విదేశాంగశాఖ తాజా జాతీయ గణాంకాల ప్రకారం.. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్‌పోర్ట్ ధ్రువీకరణను పూర్తి చేస్తూ.. తకువ పని దినాల్లోనే ఎకువశాతం కేసులను పరిషరిస్తున్నట్టు తేల్చారు. ఈ సేవలు పొందిన 95% మంది పౌరులు సంతృప్తిగా ఉన్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. రోజుకు సగటున 2వేలు, ఏడాదికి 8లక్షల వరకూ వెరిఫికేషన్లతో తెలంగాణ ముందంజలో నిలిచిందని పేర్కొన్నది. తెలంగాణ పోలీసులు పాస్‌పోర్ట్ ధ్రువీకరణలో ‘గోల్డ్ స్టాండర్డ్’ నెలకొల్పినందుకు గర్వంగా ఉన్నదని డీజీపీ జితేందర్ తెలిపారు.