హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నడిరోడ్లపైనే హత్యలు.. బహిరంగంగా దోపిడీలు..మహిళలపై విచ్చలవిడిగా పెరిగిపోతున్న దాడులు.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఇది. నేరాలను నియంత్రించాల్సిన పోలీస్ విభాగం అసలు పనిని వదిలేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసుల ఫోకస్ పూర్తిగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. రాజకీయచట్రంలో చిక్కుకున్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా సిబ్బంది శాంతి భద్రతలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేరస్తులపై నిఘా వదిలేసి ప్రతిపక్ష రాజకీయ నేతలపైనే నిఘా పెడుతుండటంతో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలు మొదలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులపై పోలీసు నిఘా పెరిగిందన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు.. పొద్దున లేచింది మొదలు ‘ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఆందోళనలు చేస్తున్నారు? ఎప్పుడు ధర్నాలు చేస్తున్నారు.? వారు ఎక్కడున్నారు?’ వంటి వివరాలు కనుక్కోవడానికే సమయం సరిపోతున్నదని పోలీస్ వర్గాలే పేర్కొంటున్నాయి. వారి మొబైల్ నంబర్లు కనుక్కొని, ఆ నంబర్లను ట్రేస్ చేస్తూ, ముందస్తు అరెస్టులు చేయడానికి, వారు హైదరాబాద్ వరకు చేరకుండా అడ్డుకోవడానికే పూర్తి సమయం వెచ్చించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
రాజకీయ చక్రంలో చిక్కి..
మండలస్థాయి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయాల వరకూ పోలీసులు రాజకీయ చట్రంలో కొట్టుమిట్టాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పోలీసు బాసులు స్థానిక రాజకీయ నేతలు, మంత్రులు చెప్పే అంశాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తూ అసలు డ్యూటీలను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల ఇండ్లకు వెళ్లి బెదిరించడం, తమ చెప్పులతో తామే కొట్టుకున్నా కూడా రైతులపై కేసులు పెట్టే స్థాయికి దిగజారడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. చాలామంది పోలీసులు భూ వివాదాల్లో తలదూర్చుతున్నారనేది బహిరంగ రహస్యం. సివిల్ వివాదాలను పక్కనపెట్టి, నేరాల కట్టడికి కృషి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, డీజీపీ హెచ్చరించినా కొందరి తీరు మారడం లేదు. నేరాలను తగ్గించడానికి ప్రణాళికలు రచించడం, పెట్రోలింగ్ పెంచడం, మహిళలకు, ప్రజలకు భరోసా కల్పించడం వంటి పోలీసుల డ్యూటీని ఎప్పుడో వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
స్టేషన్ రావడమే మానేశారు
కొందరు ఖాకీలు రోజూ గంటల తరబడి ల్యాండ్ సెటిల్మెంట్లు, సొంత పనుల్లో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శిస్తున్నారు. వారు స్టేషన్లలో అందుబాటులో ఉండకపోవడంతో ఫిర్యాదుదారులు గంటల తరబడి ఎదురుచూసి, నిరాశగా వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎస్‌హెచ్‌వోలు ఉదయం పదిగంటలకు స్టేషన్లో దర్శనమిస్తే మళ్లీ రాత్రి 7 గంటల తర్వాతే ఫిర్యాదుదారులను కలుస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ పనితీరు కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఫిర్యాదుల్లో ఇదే విషయం తేటతెల్లమైంది.
నేరగాళ్లకు భయం పోతున్నది
పోలీసులు తమ డ్యూటీలను పక్కన పెట్టడం, గ్రామస్థాయిలో సరైన పెట్రోలింగ్ లేకపోవడం, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నిఘా పెట్టకపోవడం వల్ల నేరస్తులకు పోలీసులు అంటేనే భయం లేకుండా పోతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. నేరం చేసే సమయంలో ‘పోలీసులు పట్టుకుంటారేమో? జైలుకు పంపుతారేమో? శిక్ష పడుతుందేమో?’ అనే భయం ఏ మాత్రం కనిపించడం లేదని పోలీస్ వర్గాలే పేర్కొంటున్నాయి. అందుకే నేరం చేయాలనుకునే వారు నిర్భయంగా, జంకు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. నడి రోడ్డుపైనే అత్యంత దారుణంగా ప్రత్యర్థులను నరికి చంపడం, ‘ఎందుకు?’ అని అడిగితే.. ‘మమ్మల్ని అనేవారు ఎవరు?’ అంటూ నిర్భయంగా సమాధానాలు చెప్తున్న పరిస్థితి. పోలీసులు పట్టుకుంటారనే భయం లేకుండా పట్టపగలే చోరీలు, హత్యలు, దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాలు వంటి తీవ్రమైన నేరాలు పెరుగుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇక విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరకడం కూడా నేరాల పెరుగుదలకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పాత నేరస్తులే కాదు కొత్తగా నేరాలు చేయాలనుకున్న వారిలోనూ భయం ఏమాత్రం లేకపోవడం ఆందోళనకరం. తెలంగాణలో ఇటీవల నమోదైన నేరాల్లో కొత్తగా నేరం చేసిన వారే 80శాతం వరకూ ఉండటం ఆందోళన కలిగించే అంశం.
పక్క రాష్ర్టాల నుంచి సీక్రెట్ ఆపరేషన్లు
తెలంగాణ పోలీసులకు తెలియకుండా పక్క రాష్ర్టాల పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇక్కడికి వచ్చి రహస్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వారు వచ్చి.. పెద్ద పెద్ద కేసుల్లో నిందితులను అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌కు వెళ్లే వరకూ మనోళ్లకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఇటీవల చర్లపల్లి డ్రగ్స్ కేసులో మహరాష్ట్ర పోలీసుల ఆపరేషన్ ఇలానే జరిగింది. గతంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కేసుల్లో సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇటీవల తెలంగాణలో ఉగ్రవాదులు ఉన్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వచ్చి బోధన్‌లో అరెస్టు చేసింది. పాకిస్థాన్‌తో కలిసి కుట్రలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ను అదుపులోకి తీసుకుంది. గతంలో గూఢచర్యం చేస్తున్నారని పలుచోట్ల తనిఖీలు నిర్వహించింది. మావోయిస్టులను రహస్యంగా అరెస్టు చేసిన ఘటనలు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర పోలీస్ శాఖ మేల్కొనాలని ప్రజలు కోరుతున్నారు.
కొన్ని కీలక కేసులు..
ఇటీవల తెలంగాణలో నమోదైన నేరాల గణాంకాలు
పెరిగిన కేసులు శాతం