సూర్యాపేట టౌన్, జూలై 17: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలని, సేంద్రియ సాగుపై రైతులు దృష్టిసారించాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. రైతులు వరినే కాకుండా ఇతర లాభదాయక పంటలు పండించాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన వారు కూడా వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ శాస్త్రవేత్తల అనుభవాలు, సూచనలతో లాభదాయక పంటలు సాగు చేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. 60 ఏండ్ల నుంచి రసాయన ఎరువులు వాడుతున్నామని, వాటివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సేంద్రియ సాగుపై రైతులు దృష్టిసారించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుమిత్ర ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో 30 మంది అభ్యుదయ రైతులు, 10 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలను సన్మానించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, రైతుమిత్ర ఫౌండర్ పగడాల ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.