తొగుట,జూలై 12: అత్త పేరు మీద బీమా చేయించి తర్వాత హత్య చేయించి సొమ్ము చేసుకోవాలనే అల్లుడి కుట్ర సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లిలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ శనివారం వివరాలు వెల్లడించారు. పెద్దమాసాన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్ అదే గ్రామానికి చెందిన తాళ్ల కరుణాకర్‌కు అప్పుగా రూ. 1,30,000 ఇచ్చాడు. పౌల్ట్రీఫాం వ్యాపారం, వ్యవసాయం చేసి రూ.22 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన తన అత్త, దివ్యాంగురాలు తాటికొండ రాములమ్మ (50) పేరుమీద తపాలా కార్యాలయంలో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల బీమా, ఎస్బీఐలో ఏడాదికి రూ.2,000 చెల్లించి రూ.40 లక్షల బీమా చేయించాడు.
తన మిత్రుడు కరుణాకర్ తండ్రి సత్తయ్య పేరుమీద ఉన్న 28గుంటల భూమిని అ త్త రాములమ్మ పేరుమీద చేయించి రూ.5 లక్షల రైతు బీమా కోసం దరఖాస్తు చేశాడు. అనంతరం బీమా సొమ్ము కాజేయాలని కుట్రపన్ని తన మిత్రుడు కరుణాకర్‌ను సంప్రదించాడు. తాను అప్పుగా ఇచ్చిన రూ. 1,30,000 ఇవ్వాల్సిన అవసరంలేదని, బీమా సొమ్ము చెరిసగం పంచుకుందామని ఒప్పందం చేసుకున్నారు. ఈనెల 7న కరుణాకర్ ఓ వాహనాన్ని సెల్ఫ్ డ్రెవింగ్కు కిరాయికి తీసుకుని రాములమ్మను ఢీకొట్టాడు. ఏమీ ఎరుగనట్టు వెంకటేశ్ తన అత్తను ఎవరో గుర్తుతెలియని వాహనంతో ఢీకొట్టి చంపేశారని ఫిర్యాదు చేశాడు. తొగుట సీఐ లతీఫ్, ఎస్సై రవికాంతారావు విచారణ చేపట్టి తాళ్ల వెంకటేశ్, తాళ్ల కరుణాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త రలించారు. కుట్ర కేసును ఛేదించిన సిబ్బందిని సీపీ అభినందించారు.