హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 సహా అన్నిరకాల వైరస్‌లను క్షణాల్లో చంపగలిగే అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు తెలంగాణవాసి మండాజి నర్సింహాచారి. దానిపేరు ‘ఇన్‌స్టా షీల్డ్’. ఇందులో వాడిన టెక్నాలజీకి సీసీఎంబీ అనుమతి లభించడం, ఇలాంటిది దేశంలోనే మొదటిది కావడం విశేషం. ఈ పరికరాన్ని ఆన్ చేయగానే ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. అవి వైరస్‌లోని ‘ఎస్-ప్రొటీన్’ను ఆకర్షించి, ఆ ప్రొటీన్‌ను నిర్వీర్యం చేస్తుంది. ఈ పరికరం నుంచి ఒక సెకనుకు 100 కోట్ల నుంచి 10 వేల కోట్ల ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ఒక పరికరం ఐదువేల చదరపు అడుగుల ప్రాంతంలో ఉన్న వైరస్‌లను నిర్వీర్యం చేయగలుగుతుంది. ఇందుకు 18 నిమిషాలు పడుతుంది. దీనికి ప్రత్యేకంగా విద్యుత్తు కనెక్షన్ అవసరం లేదు. బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది.
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన మండాజి నర్సింహాచారి పాడైపోయిన ట్యూబ్లైట్లను వెలిగించి అందరినీ అబ్బురపరిచారు. 1994 నుంచి తాను చేసిన ఈ ప్రయోగాలు 2000 సంవత్సరంలో ఫలించాయి. అనేక అవార్డులు ఆయనను వరించాయి. ఈ క్రమంలో ఆయన నవీపేట నుంచి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు తరలివచ్చారు. కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో పాడైన ట్యూబ్లైట్లను వెలిగించిన స్ఫూర్తితో 2020లో ఫిలమెంట్ లేకుండా యూవీ లైట్‌ను ఆవిష్కరించారు. దానికి నర్సింహాచారి పేటెంట్ హక్కు కూడా పొందారు. యూవీ కిరణాలతో మనుషులు, జంతువులకు హాని కలుకుండా పరికరాన్ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. 5-15 సెకండ్లలోనే పరికరంపై పడిన కొవిడ్సహా అన్నిరకాల వైరస్లు చనిపోయేలా పరికరాన్ని తీర్చిదిద్దారు.
వైరస్‌ను చంపడంలో అతితక్కువ సమయం తీసుకొన్న పరికరంగా ఇది రికార్డు సాధించింది. ఈ టెక్నాలజీని సీసీఎంబీ స్వయంగా పరిశీలించి నర్సింహాచారితో ఒప్పందం చేసుకొన్నది. సీసీఎంబీ సహకారంతో ఈ పరికరాన్ని ఇన్‌స్టాషీల్డ్ అనే హైదరాబాదీ సంస్థ ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేస్తున్నది. దీనిని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్‌లు, హాస్పిటళ్లు వంటి ప్రాంతాల్లో వాడవచ్చని, పూర్తి సురక్షితమని సంస్థ డైరెక్టర్ హితేశ్ పాటిల్ పేర్కొన్నారు.