హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) సిబ్బంది ఆకస్మికంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) రికార్డులు, ట్రేడ్ లైసెన్స్‌ల పరిశీలనలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు.
ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురొంటున్న తరుణంలో ఆస్తిపన్ను సవరణ కోసమే ఈ కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జోరందుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సిబ్బంది పీటీఐఎన్ డాటా ఆధారంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పన్ను విధిస్తున్న, అసలు పన్ను పరిధిలోకి రాని, తకువ పన్ను చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించే పనిలోపడ్డారు. వీటితోపాటు వాణిజ్య సంస్థల ట్రేడ్ లైసెన్స్‌లను కూడా తనిఖీ చేస్తున్నారు. అధికారులు దీనిని సాధారణ ప్రక్రియ అని చెప్తున్నా పన్నుపోటు తప్పదేమోనని పుర ప్రజలు భయపడుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే గడువు రెండు వారాలే ఉన్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ ఏడాదికి రూ.1,175 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఇప్పటివరకు రూ.505 కోట్లు మాత్రమే వసూలైంది. నిరుడు రూ.1,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకొని 64 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు.
ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తూ.. పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని ఉద్యోగులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ సిబ్బంది పన్నువసూళ్ల వేగాన్ని పెంచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడంతో సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల ఆస్తులు కొత్తగా గ్రేటర్ పరిధిలోకి వచ్చిచేరాయి.
వీటి ద్వారా మరో రూ.400 కోట్ల నుంచి 500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ పన్నులను ఎవరు వసూలు చేయాలనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నివాస గృహాలపై ఆస్తి పన్నును పెంచలేదు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి పన్ను సవరణపై ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవని ఉన్నతాధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీవ్రమైన తనిఖీలు మాత్రం ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.