హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/మణికొండ: బుల్కాపూర్ నాలా హద్దుల నిర్ధారణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. జన్వాడలోని ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమైందని ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహంగా ప్రచారం చేసింది. దీంతో జన్వాడలో మంగళవారం రాత్రి వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ-మియాఖాన్‌గడ్డ(అగ్నిపూర్) సమీపంలోని ప్రదీప్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్ ముందు ఉన్న బుల్కాపూర్ నాలాను రెవెన్యూ శాఖ నుంచి ఆర్ఐ, సర్వేయర్‌తోపాటు నీటిపారుదల శాఖకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కలిసి పరిశీలించారు. నాలా విస్తీర్ణంపై టేపులు పెట్టి కొలతలు తీసుకుని వెళ్లిపోయారు.
అధికారులు నాలాపై కొలతలు చేపడుతున్నారన్న విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో స్థానికులు, మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొన్నది. హైడ్రా అధికారులు ఫాంహౌస్‌ను కూల్చివేస్తారని ప్రచారం జరగడటంతో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది. విషయాన్ని తెలుసుకున్న మోకిల పోలీసులు అక్కడకు చేరుకుని గుమిగూడిన ప్రజలను పంపించేశారు. బుల్కాపూర్ నుంచి గండిపేట వరకు ఉన్న ప్రాంతాల్లో వర్షం పడినపుడు వరదనీరు గండిపేట జలాశయంలోకి వెళుతుంది. వరదనీరు వెళ్లే నాలాకే బుల్కాపూర్ నాలా అని పేరు. శంకర్పల్లి పరిధిలోని బుల్కాపూర్ నుంచి జన్వాడ, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఇబ్రహీంబాగ్ చెరువుమీదుగా బుల్కాపూర్ నాలా గండిపేట వరకు ఉంటుంది.
గండిపేటలో సర్ప్లస్ వాటర్ హుస్సేన్‌సాగర్‌లోకి మళ్లించేలా గండిపేట నుంచి షేక్‌పేట, టోలిచౌకి, ఎండీ లైన్స్, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు కూడా బుల్కాపూర్ నాలా ఉంది. బుల్కాపూర్ గ్రామం నుంచి గండిపేట వరకు ఉన్న బుల్కాపూర్ నాలా ఒక్కోచోట ఒకో రీతిలో విస్తరించి ఉంది. ఆ మేరకు ఆయా గ్రామాల నక్షాలో బుల్కాపూర్ నాలా ఎంత వెడల్పులో ఉందనేది స్పష్టంగా ఉంది. జన్వాడ మీదుగా వెళుతున్న బుల్కాపూర్ నాలాను అనుసరించే ప్రదీప్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్ ఉంది. గండిపేట ఎఫ్టీఎల్ నుంచి జన్వాడ రెండు కిలోమీటర్లపైగా దూరంలో ఉంటుంది. కానీ ఒక సెక్షన్ మీడియా గండిపేట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో జన్వాడ ఫాంహౌస్ ఉందని దుష్ప్రచారం చేస్తుంది.
నిబంధనలు ఇవి
సాధారణంగా నాలా, సాగునీటి కాల్వలకు రెండు వైపులా బఫర్‌జోన్ ఉంటుంది. నిబంధనల ప్రకారం పది మీటర్లలోపు విస్తీర్ణంలో ఉన్న నాలా, కాల్వలకు బఫర్‌జోన్ రెండు మీటర్లుగా ఉంది. అదేవిధంగా పది మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో (ఎంతైనా సరే) ఉంటే బఫర్‌జోన్ తొమ్మిది మీటర్లుగా నిర్ధారించాలి. బుల్కాపూర్ నాలా సగటున పది మీటర్ల కంటే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమం లో దాని బఫర్‌జోన్ గరిష్ఠంగా తొమ్మిది మీటర్లుగా ఉంటుంది. కాగా జన్వాడలోని గెస్ట్‌హౌస్‌కు సంబంధించి ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ కేవలం గేటు, ముందు ఉన్న ప్రహరీ మాత్రమే బఫర్‌జోన్ పరిధిలోకి వచ్చే అవకాశముంది తప్ప అందులోని భవనం చాలా దూరంలో ఉన్నదని చెప్పారు.