ఖైరతాబాద్, జూన్ 19: సంగారెడ్డి జిల్లా జిన్నారం క్రషర్ల అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆ గ్రామ రైతులు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడి యా సమావేశంలో రైతులు జేజి మురళి, ఆది రామకృష్ణ, కురవి ఆంజనేయులు, రమేశ్ తదితరులు మాట్లాడారు. జిన్నారంలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతున్నదని, పర్యావరణ, మైనింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రషర్లను ఏర్పాటు చేస్తున్నారని వారు ఆరోపించారు. పంటలను దెబ్బతీస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్రషర్ యజమాను లు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం క్రషర్ల చుట్టూ గ్రీన్‌బెల్టు లో భాగంగా మొక్కలు నాటాలని, దుమ్ము లేవకుండా స్ప్రింక్లింగ్ ఏర్పాటు చేయాలని, కానీ, అలాంటి చర్యలేవీ యాజమాన్యం చేపట్టలేదని విమర్శించారు. క్రషర్ల కారణంగా జిన్నారం మండలంలోని రాళ్లకత్వా, శివానగర్, జాజిగూడెం, సోలక్పల్లి గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, 240 ఎకరాల పరిధిలో ఈ మైనింగ్ జోన్ ఏర్పాటుచేయడం వల్ల నాలుగువేల ఎకరాలపై ప్రభావం పడుతుందని వివరించారు.
స్థానికంగా క్రషర్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలు రాజకీయ, ఆర్థిక బలంతోనే ఇష్టారాజ్యంగా మైనింగ్‌కు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, జైల్లో పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. క్రషర్ల వ్యవహారంపై హైకోర్టులో స్టే ఉన్నా రాత్రివేళల్లో దొంగచాటుగా పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.
అనుమతులు ఒకచోట… తవ్వకాలు మరో చోట
ప్రభుత్వం నుంచి తక్కువ విస్తీర్ణానికి లీజు కు అనుమతులు పొందిన క్రషర్ యాజమాన్యాలు, క్షేత్రస్థాయిలో మాత్రం సరిహద్దులు దాటి వందలాది ఎకరాల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని జిన్నారం రైతులు తెలిపారు. చుట్టుపక్కల వ్యవసాయ బావు లు ఎండిపోతున్నాయని, స్టోన్క్రషర్ల నుంచి వచ్చే తెల్లటి దుమ్ము పొరలు వందలాది ఎకరాల్లో పేరుకుపోతున్నాయని, పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పశువులకు కనీసం మేత దొరుకని పరిస్థితి ఉన్నదని, క్వారీ లారీల విచ్చలవిడి రవా ణా వల్ల గ్రామీణ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయ ని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధిక శాతం మంది క్రషర్లను తొలగించాలని కోరితే, ఆ నివేదికలను కలెక్టర్ కార్యాలయంలో బుట్టదాఖలు చేశారని ఆరోపించారు.
అధికారుల అండదండలతోనే తవ్వకాలు
నిబంధనలకు విరుద్ధంగా అనుమతించిన పరిమితికి మంచి వందల అడుగుల లోతులో తవ్వకాలు జరుపుతున్నా మైనింగ్ శాఖ, పీసీ బీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడితోపాటు పెద్దఎత్తున ప్రజాందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో రైతులు రవీందర్, బాలరాజు, శ్రీనివాస్, శ్రీధర్, కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.