కరీంనగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) పునరుద్ధరణకు తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఫ్యాక్టరీలో 11 శాతం వాటా కలిగి ఉండటంతోపాటు మౌలిక వసతులు కల్పించింది. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని కేంద్రం తుంగలో తొక్కింది. ఆర్ఎఫ్సీఎల్లో పనిచేస్తున్న పైస్థాయి ఉద్యోగుల్లో కేవలం 10 శాతం కూడా తెలంగాణ వాళ్లు లేకపోవడం కేంద్రం వివక్షకు నిదర్శనమంటున్నారు నిపుణులు.
నాడు ఎఫ్‌సీఐ..నేడు ఆర్ఎఫ్సీఎల్
దేశంలో పరిస్థితులు, సింగరేణి ప్రాంతం లో బొగ్గు నిల్వలను దృష్టిలో పెట్టుకొని 1970 అక్టోబర్ 2న ఆనాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డాక్టర్ త్రిగున్సేన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు శంకుస్థాపన చేశారు. 1980 నవంబర్ 1 నుంచి ఉత్పత్తిని ప్రారంభించి స్వస్తిక్ బ్రాండ్ పేరిట యూరియాను మార్కెట్లోకి విడుదల చేశారు. కొన్నాళ్ల పాటు రైతుల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఆ తర్వాత నిర్వహణ లోపాలు, ఇతర కారణాల వల్ల నష్టాలు వచ్చాయంటూ 1999 మార్చి 31న కంపెనీని మూసివేశారు. నాటి నుంచి సమైక్య రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎఫ్‌సీఐ పునరుద్ధరణ ఒక ఓటు బ్యాంకుగానే మిగిలిపోయింది.
యూరియా కొరత తీర్చాలని..
దేశంలో యూరియా కొరతను తీర్చాలన్న లక్ష్యంతో కేంద్రం మూతబడిన 5 ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2015 ఫిబ్రవరి 17న ఆరు సంస్థల భాగస్వామ్యంతో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఏర్పాటైంది. 2016 ఆగస్టు 7న ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2021 ఫిబ్రవరి 28న ప్రయోగాత్మకంగా ప్రారంభించి నెల తర్వాత కిసాన్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ 26 శాతం, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 26, గెయిల్ 14.3, డెన్మార్క్‌కు చెందిన హల్టర్ టాప్ 11.7, తెలంగాణ ప్రభుత్వం 11, భారత ఎరువుల సంస్థ (ఎఫ్‌సీఐ) 11 శాతం వాటాలు కలిగి ఉన్నాయి.
అండగా ఉన్న రాష్ట్ర సర్కారు
ఆర్ఎఫ్సీఎల్లో తిరిగి యూరియా ఉత్పత్తి కావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కృషి విశేషంగా ఉన్నది. ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించింది. స్థానికంగా అవాంతరాలు తొలగిస్తూ, పునరుద్ధరణకు కావాల్సిన స్వేచ్ఛను కల్పించింది. తన వాటాను ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రోత్సహించింది. ఎల్లంపల్లి నుంచి ఏటా ఒక టీఎంసీ నీరు, కర్మాగారం కోసం ప్రత్యేక జలాశయం, 40 మెగావాట్ల విద్యుత్తు సరఫరా, నీటి పైపులైన్, విద్యుత్తు లైన్లు, అప్రోచ్ రోడ్లు, పెట్టుబడి వ్యయంపై రూ.20 కోట్ల వ్యాట్ రీయింబర్స్మెంట్, విక్రయాలపై ఏడేండ్లపాటు 100 శాతం వ్యాట్ రీయింబర్స్మెంట్, ఐదేండ్లు విద్యుత్తు చార్జీల రీయింబర్స్మెంట్, టీ ఐడియా పథకం కింద స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.199.9 కోట్లు, అవసరమైన స్థలం సమకూర్చింది.
ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం
రాష్ట్రంలో యూరియా కొరత తీరడంతోపాటు స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సీఎల్కు అన్ని రకాలుగా సహకరించింది. సంస్థలో మొత్తం 426 శాశ్వత ఉద్యోగాలుండగా ఇప్పటికే 310 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో కేవలం 43 మందే తెలంగాణ వాసులు. జీఎం స్థాయి పోస్టుల్లో మనవాళ్లను కాకుండా ఇతర రాష్ర్టాల వాళ్లను నియమించారు. ఇవి కాకుండా 1085 కాంట్రాక్టు కార్మికుల పోస్టుల్లో బయట వారికే అవకాశం కల్పించినట్టు తెలుస్తున్నది. ఇంకా భర్తీకాని పోస్టుల్లోనూ బయట వారినే నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
స్థానికులకు ఉద్యోగాలివ్వరా?
ఆర్ఎఫ్సీఎల్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు. తెలంగాణ బిడ్డలకు 20 మందికే ఉద్యోగాలు లభించాయి. అత్యధికంగా గుజరాత్, బీహార్ రాష్ర్టాల వారికే కేటాయించారు. చివరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా 70 శాతం ఉద్యోగాలను బీహార్ వాళ్లకు ఇచ్చారు. అనేకసార్లు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకొనే నాథుడే లేడు.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం
ఉద్యోగం కోసం మస్త్ తిరిగినం
మా ఊరికి ఆనుకొని ఆర్ఎఫ్సీఎల్ పడితే చాలా సంతోషించినం. ఉద్యోగం తప్పక వస్తదన్నరు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి సచ్చినం. కానీ ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం రాలేదు. ఊళ్ల ఉండలేకపోతున్నం. దుర్వాసన, శబ్దాలతో సతమతమవుతున్నం.
– వడ్డేపల్లి రాము, కూలీ, వీర్లపల్లి (రామగుండం కార్పొరేషన్)
మోదీని బండి నిలదీయాలి
ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల విషయంలో స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానిని నిలదీయాలి. ‘తెలంగాణ బిడ్డలు బస్తాలు మోయాలె.. గుజరాత్ బానిసలు ఏసీ రూములల్ల ఉద్యోగాలు చేయాల్నా? తెలంగాణ బిడ్డలు కనీసం జూనియర్ ఇంజినీర్ పోస్టులకైనా పనికిరారా? భూములు, వనరులు మావి..ఉద్యోగాలు మావి కాదా ?
– మాటూరి భరత్‌గౌడ్, రైతు
ఎఫ్‌సీఐ ఉద్యోగులకు న్యాయం ఏది ?
ఎఫ్‌సీఐ మూతబడినప్పుడు ఎంతో మంది సిబ్బంది రోడ్డున పడ్డరు. ఆర్ఎఫ్సీఎల్ పునఃప్రారంభంతో వారికి లేదా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూశారు. కానీ వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు.
– ఎల్తురి యాకయ్య, అధ్యక్షుడు, ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల సంఘం