హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దేశ జనాభాలో 50 శాతం ఉన్న బలహీనవర్గాలకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నదని ఎంపీలు సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్, రాష్ట్ర విభాగం అధ్యక్షుడు పర్వతం సతీశ్, ఓబీసీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ జక్కని సంజయ్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శిబిరాన్ని గురువారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 80 ఏండ్లు అవుతున్నా కేంద్రంలో బీసీలకు మంత్రిత్వశాఖ లేకపోవడం బాధాకరమని అన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రసర్కారు బీసీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. నిజంగా రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఆరు మంత్రి పదవుల్లో బీసీలకు నాలుగు కేటాయించాలని, 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. స్థానికంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు కేంద్రంతో పోరాడితే తమ పార్టీ రాజ్యసభలో మద్దతునిస్తుందని స్పష్టంచేశారు.