ఖైరతాబాద్, జూలై 4: ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య చెప్పారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాల కో ఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో ‘ఎస్సీ రిజర్వేషన్ల డివిజన్, రోస్టర్ పాయింట్లు’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 15 శాతం ఉన్న రిజర్వేషన్లలో మాలలకు ఆరు శాతం కేటాయించారన్నారు. ప్రస్తుతం వర్గీకరణ అనంతరం ఉప కులాలకు ఒక శాతం, తొమ్మిది శాతం మాదిగ, ఉప కులాలకు, ఐదు శాతం మాలలకు కేటాయించారని తెలిపారు.
గ్రూప్ 1, 2 కులాలకు ఉద్యోగాలు వస్తున్నాయని, కానీ మాలలకు మాత్రం రావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు ప్రాధాన్యత కల్పించాలని, రోస్టర్ పాయింట్లను సవరణ చేసిన తర్వాత మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల జేఏసీ నేత మందాల భాస్కర్, ఫోరం కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ తిరుపతయ్య, సభ్యురాలు బండా శకుంతల, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, ఫోరం సభ్యులు సర్వయ్య, లింగస్వామి, సైదులు, మాల స్టూడెంట్స్ జేఏసీ అధ్యక్షుడు మాదాసు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.