హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వాహనాలతోపాటు వాటి విడిభాగాల తయారీ, ఎనర్జీ స్టోరేజీకి తెలంగాణను ప్రధాన కేంద్రంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతున్నదని తెలిపారు. నిహాల్చంద్ హాన్ అధ్యక్షతన ఎంపీలు సుదర్శన్ భగత్, కమలేశ్ పాశ్వాన్, అశోక్‌కుమార్ రావత్, కే మురళీధరన్, శ్యామ్సింగ్ యాదవ్, ఎం శ్రీనివాసులురెడ్డి, పినాకి మిశ్రాతో ఏర్పాటైన ఈ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ గురించి తెలుసుకొన్నది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర విధానాన్ని రూపొందించిందని, పదేండ్లపాటు కొనసాగే ఈ పాలసీ రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమ స్థిరంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేసిందని వివరించారు.
ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్, కాంపోనెంట్ల తయారీకి తెలంగాణను ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. షేర్డ్ మొబిలిటీ, చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈవీల తయారీకి పెట్టుబడులను ఆకర్షించడం,భారీస్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు.
బ్యాటరీ తయారీకి ఈవీ అడాప్షన్ ఇన్సెంటివ్‌లు, సైప్లెసైడ్ ఇన్సెంటివ్‌లను ఇవ్వడం ద్వారా బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్‌కు డిమాండ్‌ను పెంపొందించడంపై కూడా దృష్టి సారించినట్టు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల్లో మినహాయింపు ఇచ్చిందన్నారు. వాణిజ్యపరంగా లాభదాయకమైన ఈవీ చార్జింగ్ వ్యాపారానికి మారెట్ను సృష్టించడానికి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, బుద్ధ ప్రకాశ్, వీసీ సజ్జనార్‌లు పాల్గొన్నారు.