హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): అది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్.. శుక్రవారం ఉదయం.. కౌంట్‌డౌన్ 5.. 4.. 3.. అంటూ మైక్‌లో అనౌన్స్మెంట్.. సరిగ్గా 11:30 గంటలకు ఒక్కసారిగా నిప్పులు చిమ్ముతూ ఒక రాకెట్ ఆకాశం వైపు దూసుకెళ్లింది. అంతే.. ఆ ప్రాంతమంతా చప్పట్లతో మార్మోగింది. కాసేపటికే, భారత తొలి ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ సంస్థ.. ప్రారంభ్ పేరుతో ప్రయోగించిన విక్రమ్ సబార్డియన్ (విక్రమ్-ఎస్) రాకెట్ విజయవంతంగా రోదసిలో మీసం మెలేసింది. ఈ రాకెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్-స్పేస్‌టెక్, తమిళనాడుకు చెందిన స్పేస్‌కిడ్స్, ఆర్మేనియాకు చెందిన బజూమ్‌క్యూ కంపెనీల పేలోడ్లు ఆకాశంలో అడుగుపెట్టాయి. ఈ అద్భుత సన్నివేశానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. ఈ సందర్భంగా ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. ‘మిషన్ ప్రారంభ్ విజయవంతం అయ్యిందని ఆనందంగా ప్రకటిస్తున్నా’ అని తెలిపారు. ప్రయోగం చేపట్టిన స్కైరూట్, సహకారం అందించిన ఇస్రోకు ఆయన అభినందనలు తెలిపారు.
సరిగ్గా 55 ఏండ్ల క్రితం.. 1967 నవంబర్ 18న స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రాకెట్‌ను ఇక్కడి నుంచే ప్రయోగించారు. ఆ ప్రయోగాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు.. అదే నవంబర్ 18న.. ప్రైవేట్ సంస్థ తొలి రాకెట్‌ను ప్రయోగించింది.
స్కైరూట్ బాటలో మరో అంతరిక్ష కార్యకలాపాల సంస్థ ధ్రువ స్పేస్ కూడా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 26న ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నది. ధ్రువ స్పేస్ సంస్థ.. భూమిపై స్పేస్ స్టేషన్లతో పాటు ఉపగ్రహాలను తయారు చేస్తున్నది. రాకెట్లు, శాటిలైట్లు, గ్రౌండ్ సర్వీసెస్ సేవలను అందిస్తున్నది. హైదరాబాద్‌తో పాటు ఆస్ట్రియాలోని గ్రాజ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. అక్టోబర్‌లో జరిగిన తెలంగాణ ఇండస్ట్రీ అవార్డుల్లో బెస్ట్ స్టార్టప్ సిల్వర్ అవార్డును ఈ సంస్థ దక్కించుకొన్నది.
అంతరిక్ష సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నది. తెలంగాణ సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో ఇక్కడి స్టార్టప్ కంపెనీలు.. ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే స్కైరూట్, ధ్రువ కంపెనీలు. స్కైరూట్.. లాంచ్ వెహికల్స్‌ను తయారు చేస్తుంటే, ధ్రువ స్పేస్.. శాటిలైట్స్‌ను తయారు చేస్తున్నది. ఇదంతా ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచిన టీహబ్ చలవే.
అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ పాలసీని రూపొందించింది. ఈ పాలసీలో స్పేస్ మార్కెట్ వాల్యూ చైన్‌ను రూపొందించి, అందులో చాలా అంశాలను చేర్చింది. ఇందులో ప్రధానంగా శాటిలైట్ మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ సర్వీసెస్, శాటిలైట్ ఆపరేషన్స్, కెపాసిటీ సర్వీసెస్, గ్రౌండ్ ఎక్విప్మెంట్ అండ్ టర్మినల్స్, డౌన్ స్ట్రీమ్ సర్వీసెస్ వంటి అంశాలను పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ స్పేస్ టెక్ ప్రేమ్ వర్క్ పాలసీని తయారుచేసింది. ఈ పాలసీతోనే స్పేస్ స్టార్టప్‌లు చరిత్ర సృష్టిస్తున్నాయి.
అంతరిక్ష ప్రయోగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం
హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. యావత్తు ప్రపంచం నగరం వైపు చూస్తున్నది. రక్షణ శాఖ పరంగానూ ఇక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కల తయారీ సైతం ఇక్కడే జరుగుతున్నది. తమ సంస్థ తరఫున 2010లోనే తొలిసారి విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. తెలంగాణ ప్రభుత్వం స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ పాలసీని రూపొందించి అంతరిక్ష కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నది. ఇది మాలాంటి వారికి ఉత్సాహాన్ని ఇస్తున్నది.
– రఘునందన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్, ఫౌండర్ సెక్రటరీ.